Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమ్మక్క, సారక్కలు దేవతలే కాదనీ, వారిని కోట్లాదిమంది ఆరాధించడం ఏమిటని అవమానించిన చిన జీయర్ స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్ట్ చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్ )తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జాన్ వెస్లీ టి స్కైలాబ్ బాబు బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.గతంలో మాంసాహారం తినేవారిని అవమానిస్తూ మాట్లాడిన చినజీయర్, నేడు అట్టడుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం తన అహంభావాన్ని రుజువు చేసుకున్నాడని విమర్శించారు, స్వామీజీ ముసుగులో అక్రమ ఆస్తులు కూడబెట్టుకుంటూ మోసాలుచేస్తున్నాడని తెలిపారు. కోట్లాది మంది ప్రజలు కొలుచుకునే వన దేవతల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు తగదని పేర్కొన్నారు.గిరిజనుల మనోభావాలు దెబ్బతీసిన చినజీయర్‌ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే దళిత గిరిజనుల ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
సమ్మక్క, సారక్కలను అవమానించటం దారుణం : తెలంగాణ గిరిజన సంఘం
చినజీయర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బుధవారం ఒక ప్రకటనలో తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్. శ్రీరాంనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మక్క, సారక్కలు దేవతలే కాదనీ, వారిని కోట్లాదిమంది ఆరాధించడమేమిటని ఆయన ప్రశ్నించటం వన దేవతలను అవమానించటమేనని పేర్కొన్నారు. పరోక్షంగా గిరిజన జాతిని కించపరిచారని తెలిపారు. వాళ్లు దేవతలు కాదనీ, అడవిలో ఒక సామాన్యమైన వారనీ, అటువంటి వారికి కోట్లాది రూపాయల ముడుపులు ఎందుకు సమర్పిస్తున్నారని అవహేళన చేయటం తగదని పేర్కొన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతోచిన జియర్ భక్తి ముసుగులో దోపిడీలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. టైపిస్ట్ ఉద్యోగం చేస్తూ చిన్న జీయర్ స్వామిజీ అవతారమెత్తి వేల కోట్లకు పడగలెత్తారని తెలిపారు. అహంకార, ఆధిపత్య, మనువాదంతో ఆయన మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గిరిజనుల మనోభావాలను దెబ్బతీసిన చినజియర్పై కేసు నమోదు చేయకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.