Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సీనియర్ పాత్రికేయులు హెచ్ విద్యారణ్య (62) ఆకస్మికంగా మరణించారు. ఆయన 40 ఏండ్లుగా జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో ఆయన తన ఓటుహక్కును కూడా వినియోగించుకున్నారు. మంగళవారం రాత్రి హఠాత్తుగా రక్తపు వాంతులు చేసుకున్నారు. కుటుంబసభ్యులు హుటాహుటిన యశోదా ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. కృష్ణాపత్రికతో ఆయన జర్నలిస్టు ప్రస్థానం ప్రారంభమైంది. ఆంధ్రపత్రిక, ఈనాడు, హిందీమిలాప్ పత్రికల్లో ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రస్తుతం ఆయన 'సకల్' మరాఠీ దినపత్రికలో హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ కన్నడ భాషల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. భౌతికకాయాన్ని స్వస్థలం కర్నూలుకు తరలించారు. గురువారం అక్కడే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
సీఎం సంతాపం
సీనియర్ జర్నలిస్టు హెచ్ విద్యారణ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పాత్రికేయలోకానికి తీరని లోటు అని నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
ఫోటోజర్నలిస్టుల సంఘం సంతాపం
సీనియర్ పాత్రికేయులు హెచ్ విద్యారణ్య ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనుమల్ల గంగాధర్, కేఎన్ హరి సంతాపం తెలిపారు. ఫోటో జర్నలిస్టులతో ఆయన చాలా సఖ్యతగా మెలిగేవారనీ, ఆయన మరణం పాత్రికేయలోకానికి తీరని లోటు అని వారు పేర్కొన్నారు.
బీజేపీ నేతల సంతాపం
సీనియర్ పాత్రికేయులు విద్యారణ్య మరణం పట్ల కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షలు కే లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, నల్లు ఇంద్రసేనారెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
పాత్రికేయలోకానికి లోటు :నవతెలంగాణ ఎడిటర్ ఆర్ సుధాభాస్కర్
సీనియర్ పాత్రికేయులు హెచ్ విద్యారణ్య మరణం పాత్రికేయలోకానికి తీరని లోటు అని నవతెలంగాణ దినపత్రిక సంపాదకులు ఆర్ సుధాభాస్కర్ సంతాపం తెలిపారు. బహుభాషా పత్రికల్లో పనిచేసి, జర్నలిజంలో ఆయన విశేష అనుభవాన్ని గడించారని కీర్తించారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం
సీనియర్ జర్నలిస్టు విద్యారణ్య మరణం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బీ బసవపున్నయ్య బుధవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయన మరణం పాత్రికేయలోకానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.