Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్‌గాంధీకి బాధ్యతలు అప్పగించాలని సీఎల్పీ తీర్మానం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశానికి, కాంగ్రెస్ పార్టీకి సోనియా, రాహుల్ నాయకత్వమే శిరోధార్యమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ తీర్మానం చేసినట్టు తెలిపారు. రాహుల్‌గాంధీకి ఏఐసీసీ బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఈమేరకు అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశమైంది. ఎమ్మేల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పోడెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తిని, దేశాన్ని రక్షించడం కోసం యువనేత రాహుల్‌గాంధీ స్వీకరించాలని కోరారు. మత చాంధసవాదులు జాతిని విచ్ఛిన్నం చేసేందుకు దేశంలో పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్న నేపథ్యంలో లౌకికవాదంతో దేశాన్ని, రాజ్యాంగ స్పూర్తిని పరిరక్షించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. దేశంలో అనేక రకాల విధ్వంసకర చర్యలు, మతపర హింస పెచ్చరిల్లుతున్న ఈ సమయంలో దేశాన్ని కాపాడలంటే రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలని తీర్మానం చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ నాయకత్వం చాలా అవసరమన్నారు. రాహుల్ గాంధి వెంటనే ఎఐసిసి బాధ్యతలు స్వీకరించాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్షం విజ్ఞప్తి చేస్తున్నదని తెలిపారు.పంజాబ్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ఉండవనీ, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తున్నదని ధీమావ్యక్తం చేశారు.
జీవో 111పై సమగ్రంగా చర్చించాలి : కాంగ్రెస్
జీవో 111ను నిపుణుల కమిటీ నివేదిక రాగానే ఎత్తివేస్తామంటూ సీఎం చేసిన ప్రకటనను కాంగ్రెస్ ఖండించింది. ఈ అంశాన్ని అన్ని పక్షాలతో కలిసి సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేసింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్, సీనియర్ నేత కోదండరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. నేషనల్ సెన్సింగ్ అథారిటీ హైదరాబాద్‌లో ఏ భూమి ఎలా వాడుకోవాలో తెలియజేసిందని చెప్పారు. గండిపేట నీరు చాలా మంచివనీ, అలాంటి చెరువులను పొడిచేస్తామనడం సరైందికాదన్నారు. జీవో రద్దు సమాచారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు.