Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ కార్యాచరణే సమాజ మార్పునకు పునాదని చాటిచెప్పిన మేధావి
- అభివృద్ధి నిరోధక విధానాల గర్భంలోనే ఫాసిస్టు మూలాలు
- రష్యా పతనం తర్వాత సామ్రాజ్యవాద అనుకూల సిద్ధాంతాలు
- ప్రత్యర్థుల వాదనలను ఎప్పటికప్పుడు తునాతునకలు
- భారతదేశంలో స్ధిరపడాలనే కోరిక నెరవేరక అమెరికాలోనే తుదిశ్వాస
- వైవిధ్య అంశాలను మార్స్కిస్టు కోణంలో సులభంగా ప్రజలకు చేరేలా కృషి : వెబినార్‌లో బివి రాఘవులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మార్క్సిస్టు మేధావి, ప్రముఖ తత్వవేత్త, సాహితీవేత్త, జర్నలిస్టు, వైవిధ్య అంశాలను, రాజకీయ సిద్ధాంతాలను ప్రజా ఉద్యమాల కోసం ఉపయోగించిన గొప్ప మేధావి ప్రొఫెసర్ ఐజాజ్ అహ్మద్ అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు కొనియాడారు. ఆయన నిత్య చైతన్య దీపికగా వెలుగొందారని గుర్తు చేశారు. సిద్ధాంతాల ద్వారానే సమాజంలో మార్పు వస్తున్నదనే వాదనలు ఆయన నిర్వ్దంధంగా తిరస్కరించినట్టు తెలిపారు. రాజకీయ కార్యాచరణతో సమాజ మార్పునకు పునాది అని చాటి చెప్పిన మేధావి అని వివరించారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 'ప్రొఫెసర్ ఐజాబ్ అహ్మద్‌కు నివాళులర్పిస్తూ...భారత దేశ నేపథ్యంలో మార్క్సిస్టు సిద్ధాంతంపై ఆయన కృషి' అనే అంశంపై వెబినార్ జరిగింది. ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా బివి రాఘవులు మాట్లాడుతూ వామపక్ష ఉద్యమానికి, ముఖ్యంగా సీపీఐ(ఎం) సైద్ధాంతిక వ్యాసాలు ఎన్నో రాశారని గుర్తు చేశారు. ఫ్రంట్‌లైన్ పత్రికలో తక్షణ సమస్యలపై రాసిన వ్యాసాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని చెప్పారు. లెఫ్ట్వర్డు ప్రచురణ సంస్థతో ఆయనకు ఎంతో అనుబంధం ఉందనీ, దాని ద్వారా ఎన్నో పుస్తకాలు ప్రచురించారని తెలిపారు. సోషలిజానికి ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారీ మార్క్సిస్టు వర్గ దృక్పథాన్ని వివరిస్తూ...ప్రత్యర్థుల వాదనలను తునాతునకాలు చేశారనీ, తద్వారా మార్క్సిస్టు చైతన్యాన్ని రగిలించారని చెప్పారు. ఆయన సేవలు మరువలేని అన్నారు.
ఇండియా టూ పాకిస్థాన్ వయా అమెరికా...
'ఐజాజ్ అహ్మద్ ఇండియాలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముజఫర్ జిల్లాలో జన్మించారు. 1941 దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్తాన్‌కు వెళ్లింది. అక్కడే విద్యనభ్యసించారు. ఉర్ధూ భాషలో పట్టుసాధించారు. అక్కడే కార్మిక సంఘాలతో అనుబంధం ఏర్పడింది. నిరంకుశల పాలకులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. సాహిత్యంపై ఎన్నలేని మక్కువ ఏర్పడింది. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత పశ్చిమ పాకిస్తాన్ పట్ల పాలకులు నిరంకుశంగా వ్యవహరించారు. అణిచివేతలు, అరెస్టులు, ఉద్యమకారులను జైల్లోకి పంపించేవారు. ఈ క్రమంలోనే ఆయన విద్యనంభించేందుకు అమెరికా వెళ్లారు. అక్కడే ఆంగ్లంపై పట్టు సాధించారు. సాహిత్యం, రాజకీయ అంశాల పట్ల ఆయన ఎంతో మక్కువ పెంచుకున్నారు. అమెరికాలో అనేక యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా పని చేశారు. అమెరికా సామాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్నారు. వియత్నాం దేశంపై అమెరికా నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా పోరాడారు. ఇండియాలోనూ జేఎన్‌యూ తదితర యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పని చేశారు. ఈ క్రమంలో ఇండియాలో స్థిరపడాలనే ఆయన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. మతోన్మాదుల చేష్టలు చూడలేక, విధిలేని పరిస్థితుల్లో ఆయన అమెరికా వెళ్లిపోయి కాలిఫోర్నియాలో తుదిశ్వాస విడిచారు' అని చెప్పారు.
గుజరాత్ మరణకాండ దుర్మార్గపు పునాదులను బహిర్గతం
2002లో గుజరాత్ మతోన్మాదుల మరణకాండకు సంబంధించిన దుర్మార్గపు పునాదులను ఐజాజ్ బహిర్గతం చేశారని రాఘవులు చెప్పారు. మతతత్వ శక్తుల మూలాలను నిర్మొహమాటంగా ఎదిరించారని చెప్పారు. బాబ్రీమసీదు కూల్చివేత, ఫోఖ్రాన్ అణు పరిశోధనలను, 2014లో బీజేపీ అధికారంలోకి రావడంతోపాటు శరవేగంగా పెరుగుతున్న ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు వ్యాసాల రూపంలో చెప్పారని గుర్తు చేశారు. ప్రతికూల సమయంలోనూ మార్క్సిస్టు చైతన్యంతో ఎంతో ఉత్తేజాన్ని కలిగించారని చెప్పారు. సిద్ధాంత శక్తియే కాకుండా రాజకీయ కార్యాచరణకు దోహదం చేసేలా ఆయన రచనలు చేశారని పేర్కొన్నారు.
సరళీకరణ విధానాలపై తిరుగుబాటు
ఆర్థిక సరళీకరణ విధానాలపై ఆయన తిరుగుబాటు చేశారని రాఘవులు చెప్పారు. ముఖ్యంగా 1992లో సిద్ధాంతం-వర్గాలు-జాతులు- సాహిత్యం పేరుతో రచించిన పుస్తకం సంచలన కలిగించిందన్నారు. సరళీకరణ, ప్రపంచీకరణను సమర్థిస్తూ...కొత్తకొత్త సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయని చెప్పారు. అందులో మార్క్సిజానికి కాలం చెల్లించిందంటూ సామ్రాజ్యవాదులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారన్నారు. ఈ సమయంలో వామపక్ష వ్యతిరేక ప్రచారాన్ని ఆయన సమర్థవంతంగా తిప్పికొట్టారని గుర్తు చేశారు. వలసవాదనాంతర భావం అనే అంశాన్ని తుర్పార పట్టారని అన్నారు. మార్స్కిజం, సోషలిజంపై పెట్టుబడిదారి సిద్ధాంతకర్తల దాడులను సైద్ధాంతికంగా ఎదుర్కొనే వారని గుర్తు చేశారు. దక్షణాసియా రాజకీయాలపై ఆయన పలు పుస్తకాలు రచించారని చెప్పారు. బీజేపీ మతోన్మాదం, ఫోఖ్రాన్ అణు పరిశోధన, ఫాసిస్టు ఉన్మాద చర్యలు, వాటి పుట్టుకపై చర్చించారన్నారు. ఇరాన్, ఆప్ఘనిస్తాన్, అరబ్దేశాల్లో ఉగ్రవాద చర్యలు, అభివృద్ధి నిరోధక శక్తుల మధ్య వైరుధ్యాలు తదితర అంశాలను ప్రస్తావించారని తెలిపారు.
రష్యాపతనం తర్వాత మార్పులు
సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రపంచ పరిస్థితుల్లో మార్పులు సంభవించాయని రాఘవులు చెప్పారు. ముఖ్యంగా వామపక్షం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద శక్తులు బలోపేతం కావడంతోపాటు సరళీకరణ విధానాలను వేగంచేశాయన్నారు. ఐరోపాలో సోషల్ డెమెక్రటిక్ పార్టీలు దెబ్బతిన్నాయని చెప్పారు. పెట్టుబడిదారులకు రాయితీలు కల్పిస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, హక్కుల కోసం పోరాడే పార్టీలు నిర్వీర్యమైనట్టు తెలిపారు. సాంప్రదాయంగా స్థిరపడిన పార్టీలు సైతం పేర్లు మార్చుకున్నాయనీ, చిన్న పార్టీలు మూసుకున్నాయని చెప్పారు. అభివృద్ధి నిరోధక శక్తులు బలపడుతున్న వైనాన్ని ఆయన తన రచనల్లో వ్యక్తీకరిస్తూనే... ప్రపంచ విముక్తికి సోషలిజం తప్ప ప్రత్యామ్నాయం లేదని చెప్పారని గుర్తు చేశారు. ఐజాజ్ అహ్మద్ రచనలను యూట్యూబ్‌లో వినవచ్చునని చెప్పారన్నారు.