Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాబోయే రోజుల్లో వైద్య ఆరోగ్యశాఖలో 20 వేల పోస్టులు భర్తీ: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఉద్యోగులు, సిబ్బందితోపాటు మనమందరం ప్రజా సేవకులం అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో 50 పడకల సీహెచ్‌సీని, అనంతరం 12-14 ఏండ్ల పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగులు, అధికారులు సిబ్బంది అయినా ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందుండాలని, అత్యవసర సమయాల్లో ఇది తమ పని కాదని నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ప్రజల ప్రాణం కాపాడే పనిలో, అత్యవసర పరిస్థితుల్లో అందరూ తమ పనిగానే భావించి స్పందించాలని చెప్పారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేసే సిబ్బంది ఉద్యోగాలు వదిలి వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రపంచానికి తెలంగాణ రెండు టీకాలను అందించిందన్నారు. మొదటిది భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ అయితే.. రెండోది బయోలాజికల్ - ఇ సంస్థ తయారు చేసిన కార్బొవ్యాక్స్ అని తెలిపారు. 12-14 ఏండ్ల మధ్య వయసు పిల్లలకు కార్బొవ్యాక్స్ వేస్తున్నామని చెప్పారు. సెకండ్ డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశ సంగటు కంటే తెలంగాణ రాష్ట్రంలో అధికంగా వేశామని, దేశం మొత్తంలో 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తయితే.. తెలంగాణలో మాత్రం 97 శాతం పూర్తి చేశామన్నారు.