Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎల్లలు లేకుండా కొనసాగుతున్న పురుషాధిపత్యం
- పుస్తకమంటే మనిషుల జీవితం ఉండాలి
- మట్టి, చెమట, నెత్తురుతో తడవాలి
- కవిత్వమంటే యూనికోడ్లో అభిప్రాయాలు చెప్పడం కాదు
- : జవాబుకావాలి పుస్తకావిష్కరణలో జూలూరి గౌరీశంకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'తప్పకుండా జవాబు కావాలి. ఇది సమాజానికి సలీమ వేస్తున్న ప్రశ్న. సామాజికమైన ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే సమసమాజం, సమతారాజ్యం వస్తుంది. సమతారాజ్యంలో ఆకాశంలో సగభాగం ఉన్న వారు సరైన పాత్ర పోషించినప్పుడే మనం సమ భావనవైపు వెళ్లగలుగుతాం.'అని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. సలీమ కవిత్వం 'జవాబుకావాలి' పుస్తకాన్ని ఆమె తల్లి ఐద్వా రంగారెడ్డి జిల్లా నాయకులు ఎస్కె మస్తాన్బి బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో రోజూ పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతుంటాయని చెప్పారు. మనుషుల జీవితం ఉన్న పుస్తకాలు మట్టి, మట్టి తడి, చెమట, నెత్తురుతో తడిసిన పుస్తకాలు అరుదుగా వస్తాయన్నారు. అవన్నీ కలిసినప్పుడే కొడవళ్లకు పదున్లొస్తాయనీ, అవి కంకికొడవలి, సుత్తి కొడవలి అవుతాయని వివరించారు. అలాంటి పుస్తకాలు ఊరికే రావని అన్నారు. పుస్తకం రచించడమంటే సెల్ఫోన్లో యూనికోడ్లో కొట్టడం, అభిప్రాయాలు చెప్పినంత సులభం కాదన్నారు. కవిత్వం రాయడమంటే జీవితానికి సంబంధించిన అక్షరాలుండాలని సూచించారు. ఆ అక్షరం తన్నుకు రావాలంటే తపస్సు ఉండాలని చెప్పారు. అస్తిత్వం సున్నితమైన అంశమనీ, అన్నీ తెలిసి నేరం చేస్తుంటామని అన్నారు. దేశం, ప్రాంతం, జెండర్, కులం, మతం వంటి తేడాలేకుండా పురుషాధిపత్యం ఎల్లలు లేకుండా కొనసాగుతుందని వివరించారు. తెలుగు సాహిత్యానికి అస్తిత్వాలన్ని కలిసి సుసంపన్నంగా తయారైందని చెప్పారు. తెలంగాణ సాహిత్యం గొప్ప కవిత్వాన్ని ఇచ్చిన నేల ఇది అని అన్నారు. 'గోర్కీ అమ్మ నాకు ఆదర్శమైతే, నువ్వు నాకు ఆధారమయ్యావ్ అంటూ రచయిత తన తల్లి గురించి రాయడమే గొప్ప విషయం'అని ఆయన చెప్పారు. గోర్కీ అమ్మను, తనను కన్నతల్లిని పోల్చి రాయడంలో ఈ పుస్తకం గొప్పతనం, తన జీవిత మూలాలను ఈ పుస్తకంలో చేర్చారని వివరించారు. ప్రముఖ కవి శిలాలోలిత మాట్లాడుతూ ప్రశ్నలేనిదే జ్ఞానం ఉదయించదని అన్నారు. తప్పులోనుంచే ఒప్పును తెలుసుకుంటామని చెప్పారు. 'నేను రాయగలను అనుకోవడం ఆత్మవిశ్వాసం, నేనే రాయగలను అనుకోవడం అహంకారం'అని ఆమె అన్నారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి మాట్లాడుతూ కవిత్వం రాయడం వరకే కాకుండా సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పారు. సలీమ రాసిన పుస్తకంలో ఆ పరిష్కారం ఉందన్నారు. ఒత్తిడి, హింస, వివక్ష, అసమానతలు పెరుగుతున్నందుకు అమ్మాయిలు ఎక్కువగా కవితలు రాస్తున్నారని వివరించారు. ఎక్కడైతే అణచివేత, ఒత్తిడి ఉంటుందో అక్కడే తిరుగుబాటు వస్తుందన్నారు.
ఇది స్త్రీల సమస్య కాదనీ, పురుషులూ అందరూ కలిసి పోరాడాలని అన్నారు. ప్రముఖ కవి జరీనాబేగం మాట్లాడుతూ స్త్రీలు ఏదైనా సాధించాలంటే కుటుంబం నుంచి ముఖ్యంగా భర్త ప్రోత్సాహం ఉండాలన్నారు. రచయిత సలీమ మాట్లాడుతూ ముస్లిం అమ్మాయిలు బయటికి రావాలంటే కొన్ని ప్రత్యేకతలుంటాయనీ, దాని కోసం పోరాటం చేయాలని అన్నారు. ఐద్వా, సీపీఐ(ఎం)లో తన అమ్మ పనిచేయడం వల్ల తనకు కొంత స్వేచ్ఛ దొరికిందనీ, ఈ స్థాయికి వచ్చానని వివరించారు. ఈ పుస్తకం తేవడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అరసం రాష్ట్ర కార్యదర్శి కెవిఎల్, కవి యాకూబ్, సాహితీవేత్త పవన్, తెలుగు విశ్వవిద్యాలయం డిప్యూటీ డైరెక్టర్ అయినంపూడి శ్రీలక్ష్మి, సలీమ భర్త మహేష్ దుర్గే ప్రసంగించారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నస్రీన్‌ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రచయిత ఎం విప్లవ్‌కుమార్ ఈ పుస్తకాన్ని పరిచయం చేశారు. నవతెలంగాణ సంపాదకులు ఆర్ సుధాభాస్కర్, రచయిత దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు. జి నరేష్ ఆహ్వానం పలుకగా, తెలంగాణ సాహితి నాయకులు అనంతోజు మోహన్‌కృష్ణ వందన సమర్పణ చేశారు.