Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంథనిలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- వచ్చే మూడ్రోజులు వడగాల్పులు వీచే అవకాశం
- పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎండలు రోజురోజుకీ ముదురుతున్నాయి. మార్చి మూడోవారంలోనే భగభగ మండేలా దంచికొడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్, భద్రాద్రికొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, కొమ్రంభీం అసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం జిల్లాల్లో 41 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరం, ఈశాన్యం దిశ నుంచి రాష్ట్రం మీదుగా కిందిస్థాయి గాలులు వీస్తున్నాయనీ, రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె. నాగరత్న హెచ్చరించారు. ఆదిలాబాద్, కొమురంభీమ్ అసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, నాగర్కర్నూల్, జయశంకర్భూపాలపల్లి, రాజన్నసిరిసిల్ల, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాల్పులు వీయనున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రంలో 42 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా పనుల మీద రోజూ ఎండలో తిరిగే వారూ జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చితంగా తమ వెంట వాటర్ బాటిళ్లను ఉంచుకోవాలి. వేడిగాలులతో డీహైడ్రేషనకు గురయ్యే ప్రమాదమున్నది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తమ వెంట ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉంచుకోవాలి. రోజుకు కనీసం ఐదులీటర్ల నీళ్లను తీసుకోవాలి. నడుచుకుంటూ వెళ్లేవారు గొడుగు తీసుకెళ్తే బాగుంటుంది. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత వెంటనే చల్లని నీళ్లను తీసుకోకూడదు. కాసేపు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత నీళ్లను తాగాలి. వీలైతే మజ్జిగ తాగి ఉపశమనం పొందాలి. మధ్యాహ్నం పూట వీలైనంత ఎండలో బయటకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం. వృద్ధులు, చిన్నపిల్లలున్న వారు మరింత జాగ్రత్త పడాలి.
బుధవారం నాటి ఉష్ణోగ్రతల వివరాలిలా...
మంథని(పెద్దపల్లి) 42.9
ముత్తారం(పెద్దపల్లి) 42.7
రామగుండం(పెద్దపల్లి) 42.6
థానూర్(నిర్మల్) 42.5
ధర్మారం(పెద్దపల్లి) 42.4
నల్లగొండ 42.4
రాఘవపేట(జగిత్యాల) 42.3
వడ్యాల్(నిర్మల్) 42.2
ఆదిలాబాద్ అర్బన్ 42.1
జైనధ్(ఆదిలాబాద్) 42.0
మధిర(ఖమ్మం) 41.8