Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పథకాలు ఏవైనా నిధుల దారి మళ్లింపు పక్కా
- కాంగ్రెస్ హయాంలో హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు
- టీఆర్ఎస్ పాలనలో రైతు బంధు, రుణ మాఫీకి!
- క్యారీ ఫార్వర్డ్ కాని నిధులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళితుల అభివృద్ధి, వారి సంక్షేమం గురించి రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో పెద్ద చర్చ జరుగుతున్నది. శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ వారి అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పదేపదే చెప్పారు. అందుకు కేటాయింపులు కూడా చేశారు. అయితే కేటాయించిన నిధులు ఆచరణలో ఖర్చు కాకపోవటం వల్ల దళితులు ఆశించిన ఫలితం పొందలేకపోతున్నారు. దళిత నిధి సరే.. వాటిని ఖర్చు పెట్టేందుకు చిత్తశుద్ధిని ప్రభుత్వం ప్రదర్శించటం లేదన్న విమర్శలున్నాయి. రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 16శాతం ఉన్నారు. జనాభా ప్రాతిపదికన వీరికోసం బడ్జెట్లో ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నారు. అయితే సబ్‌ప్లాన్ ప్రకారం ఆ ఏడాదిలో ఖర్చు చేయలేకపోతే తర్వాత ఏడాదికి నిధులను క్యారీ ఫార్వర్డు చేయాలి. కానీ.. గడిచిన ఏడేండ్లలో ఒక్క సంవత్సరం కూడా ఈ నిధులు మిగిలిన దాఖలాల్లేవని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. క్యారీ ఫార్వర్డు చేయాల్సి వస్తుందన్న కారణంతో నూటికి నూరు శాతం ఖర్చు చూపిస్తున్నది. ఈ సంవత్సరం కేటాయింపులతో పోలిస్తే..అన్ని రంగాలతో పాటు సాంఘీక సంక్షేమ గ్రాంట్లలో కూడా పెద్ద మొత్తంలో రూ.6,124 కోట్లు ఖర్చు కాకుండా ఉన్నాయని కాగ్ తేల్చింది. మరో పక్క వివిధ శాఖల్లో దళితులకు రావాల్సిన వాటా ఉంటుంది. కానీ.. ఆ శాఖల్లో ఖర్చు చేయకుండా మిగిలిపోవటంతో ఆ మేరకు దళితుల వాటాలోనూ నష్టం జరుగుతున్నదని ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
లెక్కలపై స్పష్టత లేదు..
'ఎస్డీఎఫ్'చట్టం ప్రకారం.. ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయిస్తుంది. వాటిని 42 ప్రభుత్వ శాఖల ద్వారా ఖర్చు చేస్తారు. శాఖల వారీగా ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఎస్సీ అభివృద్ధి శాఖలుంటాయి. వీటిని నిర్దేశించిన వార్షిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి. ఏవైనా కారణాలతో నిధులు మిగిలితే తర్వాతి ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి.
ప్రత్యేక నిధి ఇలా..
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక..! రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి..! ఇలా పథకాలు ఎన్ని వస్తున్నా పేర్లు మారుతున్నాయే తప్ప దళిత, గిరిజన వాడలు, పల్లెలు, ప్రజల పరిస్థితులు మెరుగవడంలేదు. నిధుల దారి మళ్లింపు సాధారణమైపోయింది.
కాంగ్రెస్ హయాంలో 2007-08 నుంచి 2012-13 మధ్య ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.39,330.6 కోట్లను కేటాయిస్తే ఖర్చుచేసింది మాత్రం రూ.20,516.15 కోట్లే (52.16శాతం). టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏడేండ్ల రాష్ట్ర బడ్జెట్లో ఎస్డీఎఫ్ కింద ప్రభుత్వం రూ.86,684 కోట్లు కేటాయించి, రూ.55,438.89 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ఖర్చు చేయకుండా ఉన్నవి రూ.31,246కోట్లు. వీటిని తర్వాతి బడ్జెట్లలో క్యారీ ఫార్వర్డ్ చేయటం లేదన్న విమర్శ తీవ్రంగా ఉంది. ఇదిలా
ఉంటే.. ఖర్చు చేసిన నిధుల్లోనూ సగం నిధులు సార్వజనీన పథకాలకు వ్యయం చేయడంపై సామాజిక సంఘాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీ పాలనా కాలంలోలాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దళితుల డబ్బులను హుసేన్సాగర్ అభివృద్ధికి, పార్కుల సుందరీకరణకు,హుడా అభివృద్ధికి, కాళేశ్వరం ప్రాజెక్టుకు, మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ పథకాలకు ఈవీఎంలను భద్రపరిచేందుకు రోడ్లు భవనాల శాఖకు దారిమళ్లిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో అసలు ఉద్దేశం నెరవేరడం లేదు.
అందులోనూ దళితులున్నారు కదా?..
ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక నిధిని ఆయా తరగతులకే నిర్దేశించిన పథకాలకు ఖర్చుకు కూడా చేయాలనే నిబంధన ఉంది. కానీ.. అందరికీ అమలవుతున్న సాధారణ పథకాలను చూపి అందులో ఎస్సీ, ఎస్టీల వాటా ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం లక్కలేస్తున్నది. ''రైతు బంధు, రైతు బీమా, ఆరోగ్యశ్రీ, కళ్యాణలక్ష్మి, ఉచిత కరెంటు, ఆసరా పెన్షన్లు..ఇలా అన్నింటా దళిత, గిరిజన లబ్దిదారులున్నారు కదా..! అందుకే వాళ్ల కోటా నుంచి ఖర్చు చేస్తున్నాం'' అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రతి ఏడాది ఎస్సీ, ఎస్టీ ఫండ్ మానిటరింగ్ కమిటీ మీటింగుల్లో చెబుతున్న విషయం తెలిసిందే.
కాగితాలపైనే లెక్కలు..
2014 నుంచి ఇప్పటి వరకు అంటే ఏడేండ్ల కాలంలో ఎస్సీల అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చాలా డబ్బులు కేటాయించినట్టు లెక్కల చెబుతున్నప్పటికీ..క్షేత్ర స్థాయిలో దళితుల అభివద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. సబ్‌ప్లాన్ చట్టంలో ఉన్న చిన్న లొసుగును(సెక్షన్-డి) అడ్డం పెట్టుకుని ఆ చట్టం స్ఫూర్తికే విఘాతం కలిగించే చర్యలకు సర్కారు పూనుకుంటుందన్న చర్చ జరగుతున్నది. ఈ పక్షపాతి ధోరణి మారాలని సామాజిక వెత్తలు కోరుతున్నారు.