Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్సైజ్ ఎస్ఐపై దాడి
నవతెలంగాణ-భీమ్‌గల్
పెట్రోలింగ్‌కు వెళ్లిన ఎక్సైజ్ ఎస్ఐపై పలువురు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకోగా.. గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పురాణీపేట్ గ్రామ శివారులో నాటు సారా విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. దాంతో ఎక్సైజ్ ఎస్ఐ నరసింహులు సిబ్బంది మహేశ్‌తో కలిసి తన వాహనంలో పెట్రోలింగ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో పురాణీపేట్ శివారులోని మామిడి తోటలో మద్యం సేవిస్తున్న కొందరిని ఎక్సైజ్ ఎస్ఐ మందలించాడు. అనంతరం ఇతర చోట్ల తనిఖీ చేసి తిరిగి వస్తుండగా మందలింపునకు గురైన నలుగురు వ్యక్తులు ఎస్ఐ వాహనాన్ని అడ్డుకొని వాహనంలో ఉన్న ఎస్ఐ నరసింహులుపై దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో ఎస్ఐ స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయమై ఆయనను ఆరా తీయగా దాడి చేసి తనను గాయపరిచింది నిజమేనని, పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కాగా దాడి చేసిన వారిని రక్షించేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని పట్టణంలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఎస్ఐ గంగుల శ్రావణ్ కుమార్‌ను వివరణ కోరగా.. ఎక్సైజ్ అధికారులపై దాడి చేసిన విషయంలో దర్యాప్తు చేస్తున్నామని, దాడికి పాల్పడిన వారిని పట్టుకుంటామని అన్నారు.