Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రికి టీపీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి పరీక్షలను ఏప్రిల్లోనే నిర్వహించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని గురువారం హైదరాబాద్లో టీపీఏ అధ్యక్షులు ఎన్ నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్ పద్మారెడ్డి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. మే 23 నుంచి జూన్ ఒకటి వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పున:పరిశీలించాలని కోరారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 43 సెంటిగ్రేడ్లకు చేరిందని గుర్తు చేశారు. మే నెలాఖరుకు ఎండలు మండిపోయే పరిస్థితి ఉత్పన్నమవుతుందని తెలిపారు. జేఈఈ మెయిన్ పరీక్షల పేరుఓ 5.5 లక్షల మంది విద్యార్థులు పాల్గొనే పదో తరగతి పరీక్షలను వెనక్కి నెట్టేయడం అన్యాయమని విమర్శించారు. మండేఎండల్లో పరీక్షలు నిర్వహించి చిన్న పిల్లలను ఇబ్బందుల పాలు చేసి ఆరోగ్య సమస్యల కు గురిచేయడం సరైంది కాదని పేర్కొన్నారు. సిలబస్, రివిజన్ పూర్తయిన రెండునెలల విరామంతో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు నేర్చుకున్నది మర్చిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ మూడో వారం నిర్వహించేలా రీషెడ్యూల్ చేయాలని కోరారు.