Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలి : వీఆర్వో సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 5,485 మంది వీఆర్వోలను పని ఆధారంగా ఏ, బీ, సీ, డీగా విభజించి గ్రేడింగ్ ఇవ్వాలని తహసీల్దార్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫార్మా పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వీఆర్వోల సంఘం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం దానిపై స్పష్టత ఇవ్వాలని కోరింది. గురువారం ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీశ్, ప్రధాన కార్యదర్శి పల్లెపాటి నరేశ్, సహ అధ్యక్షులు కందారి భిక్షపతి, ఉపాధ్యక్షులు ఎస్కే మౌలానా, రామేశ్వరరావు, మహిళా కో-ఆర్డినేటర్ ప్రతిభ, రాష్ట్ర నాయకులు రాజయ్య, నూకల శంకర్, సర్వేశ్వర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాల అమలులో, విలువైన ప్రభుత్వ స్థలాలను కాపాడటంలో వీఆర్వోలది కీలక పాత్ర అని తెలిపారు. గ్రామ స్థాయి సమాచారాన్ని తహసీల్దార్లకు పంపడంలోనూ వీఆర్వోల సేవలు మరువలేనివని పేర్కొన్నారు. వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని కోరారు. అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలనీ, ఇతర బెనిఫిట్స్‌కు భంగం కలుగకుండా చూడాలని విన్నవించారు. కారుణ్యనియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇతర శాఖల్లోకి వెళ్లాలనుకునేవారికి ప్రమోషన్లు, ఆప్షన్లు ఇచ్చి సీనియారిటీకి నష్టం కలుగకుండా చూడాలని కోరారు. స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్ధపడే వారి స్థానంలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంక్రిమెంట్లు, డిపార్ట్మెంట్ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని కోరారు. అకారణంగా సస్పెండ్ చేసిన వీఆర్వోలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు వెంటనే పే స్కేలు ప్రకటించాలని విన్నవించారు.