Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం చెప్పిన పంటలు వేసినా మద్దతు ధర లేదు..
- వానాకాలం ఏ పంటలు వేయాలో ముందే ప్రకటించాలి :
- అఖిలభారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-మునుగోడు
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏకమొత్తంలో రుణమాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని అఖిలభారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన రైతుసంఘం సదస్సులో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు వద్దు.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని పదే పదే చెప్పడంతో రైతులు మొక్కజొన్న, కందులు వేశారన్నారు. 11 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 7 లక్షల ఎకరాల్లో కందులు వేశారని తెలిపారు. ఆ పంటలు చేతికి వచ్చాక మార్కెట్లో కనీస మద్దతు ధర లభ్యం కావడం లేదన్నారు. కందులు క్వింటాలుకు రూ.6,300 మద్దతు ధర కాగా, రూ.5,000కు మాత్రమే కొనుగోలు చేస్తున్నా రన్నారు. అలాగే, మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ సివిల్ సప్లై శాఖ కొనుగోళ్లు చేయాలన్నారు. మొక్కజొన్నలు పశువులు, కోళ్లకు, చేపలకు దాణాగా ఉపయోగపడుతాయని చెప్పారు. ఇలాంటి పంటలు వేసినప్పటికీ ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ ధ్వారా కొనుగోలు చేయడం లేదన్నారు. ప్రయివేటు వ్యాపారులతో ఈ శాఖ వారు మిలాఖత్ అయ్యారని విమర్శించారు. ఈ పంటలు కూడా కొనుగోలు చేయకుంటే రైతులు ఏ పంటలు వేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ప్రణాళిక రూపొందించలేదన్నారు. రానున్న వానాకాలంలో ఏ పంటలు వేయాలో మార్చి చివారికల్లా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ బ్యాంక్ రుణాలు వచ్చే విధంగా రుణ ప్రణాలిక, వ్యవసాయ ప్రణాళికను ఈనెల నాటకే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండా శ్రీశైలం, చాపల మారయ్య, నాయకులు వేముల లింగుస్వామి, సాగర్ల మల్లేశం నారగొని నర్సింహా, కొంక రాజయ్య, పగిళ్ళ భిక్షం, పగిళ్ళ పరమేష్, మిరియాల భరత్ తదితరులు పాల్గొన్నారు.