Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏ సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వీఆర్ఏ దుర్గం బాపు కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం డిమాండ్ చేసింది. గురువారం మంచిర్యాల జిల్లా, కన్నేపల్లి మండలంలోని కొత్తపల్లి వీఆర్ఏ దుర్గం బాపు కుటుంబాన్ని ఆ సంఘం రాష్ట్ర నాయకత్వం పరామర్శించింది. బాపు హత్యకు సంతాపం తెలిపింది. ఆయన కుటుంబానికి సానుభూతి చెప్పింది. నలుగురు అవివాహితులైన ఆడపిల్లలు, రేకుల ఇంట్లో ఉండటం చూసి చలించింది. అధైర్య పడవద్దనీ, రాష్ట్రంలోని 23 వేల మంది వీఆర్ఏలు అండగా ఉంటారని భరోసానిచ్చారు. బాపు కుటుంబానికి వీఆర్ఏ కాకుండా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేసింది. అదే విధంగా దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇల్లు, రూ.50 లక్షల పరిహారం, మూడెకరాల భూమి ఇవ్వాలని కోరారు. కత్తితో పొడిచి, గొంతు కోసి హత్య చేసిన నిందితులన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అనంతరం నాయకులు కన్నేపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో హత్య చేసిన స్థలాన్ని సందర్శించారు. అక్కడున్న వీఆర్ఏలను హత్య ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న వీఆర్ఏలు వంట చేయడం, నైట్ డ్యూటీ, స్వీపర్, అటెండర్ డ్యూటీలు చేస్తున్నామని నాయకులతో ఆవేదన వెలిబుచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నైట్ వాచ్మెన్ డ్యూటీ చేయించి పరోక్షంగా హత్యకు కారణమైన తహశీల్దార్, నయబ్ తహశీల్దార్పైన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేయించారు. అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన నాయకులు అదనపు కలెక్టర్ ను కలిసి జరిగిన విషయాన్ని వివరించారు. సానుకూలంగా స్పందించిన అదనపు కలెక్టర్, సమస్యను కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కె.దాదేమియా, ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు, జిల్లా నాయకులు బుచ్చన్న, పర్వతాలు, శ్రీనివాస్, గణపతి, దిగంబర్, కార్తీక్, రిక్రూట్ మెంట్ వీఆర్ఏల రాష్ట్ర అధ్యక్షులు రమేష్ బహుదూర్, రాష్ట్ర నాయకులు బాపుదేవ్, లింగరాజు, ఉమా మహేశ్వర్ రావు పాల్గొన్నారు.