Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుబ్బాకరూరల్
కుల వృత్తిలో పనుల్లేవు.. చేసేది లేక.. ఓ ప్రయివేటు ఆస్పత్రిలో కాంపౌండర్‌గా చేరాడు. వచ్చే జీతం ఏ మూలకు సరిపోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువ చేనేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కేంద్రంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు కాల్వ శ్రీనివాస్(37) కుల వృత్తిలో పనుల్లేకపోవడంతో కొన్ని రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య, రెండేండ్ల పాపతో పాటు తల్లి, పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి కూడా అతని దగ్గర ఉంటున్నారు. ఆస్పత్రిలో వస్తున్న చాలిచాలనీ జీతం వారి కుటుంబానికి ఏ మాత్రం సరిపోయేది కాదు. ఈ క్రమంలో అప్పులు చేయాల్సి వచ్చింది. నానాటికీ అప్పులు పెరిగిపోతుండటం, వాటిని చెల్లించే దారి తెలియకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ మృతితో అతని కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, ఆ యువ చేనేత కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, పలు కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు దుబ్బాక ఎస్ఐ మన్నే స్వామి తెలిపారు.