Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్
నవతెలంగాణ - కందనూలు
ఖాళీగా ఉన్న ఉద్యోగాల పోస్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భర్తీ చేయాలని, అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ డిమాండ్ చేశారు. గురువారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో డీవైఎఫ్ఐ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట రమేష్ మాట్లాడుతూ.. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణలో కొలువుల సమస్య ఏడేండ్లలైనా కొనసాగుతూనే ఉందన్నారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నీటిమీద రాతలే అయినవన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి రెండేండ్లలోనే 1,07,744 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిందన్నారు. కానీ ఇప్పటివరకు భర్తీ చేసింది 80వేలు కూడా దాటలేదని ఆరోపించారు. 40 లక్షల మంది యువత ఉద్యోగాలు లేక తల ఎత్తలేకపోతున్నారు. ఆశ కల్పించి ఆర్భాటంగా ఏర్పాటు చేసుకున్న టీఎస్పీఎస్సీ సంస్థలో రిజిస్ట్రేషన్(ఓ.టి.ఆర్)లో 24,82,888 మంది నమోదు చేసుకున్నారని గుర్తుచేశారు. నిరుద్యోగ సైన్యం లక్షల్లో పేరుకుపోతున్నా ఉద్యోగాల కల్పన మాత్రం లేదన్నారు. బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణలో 1,91,126 ఖాళీలు ఉన్నట్టు తేలిందని చేప్పారు. సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శివ శంకర్, జిల్లా కార్యదర్శి బి.శివవర్మ, జిల్లా సహాయ కార్యదర్శి సతీష్, నాయకులు నరేష్, నరేందర్, నవీన్, శివుడు తదితరులు పాల్గొన్నారు.