Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవన, ఇతర నిర్మాణ కార్మికుల జేఏసీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
1996 కేంద్ర చట్టం రక్షణ కోసం మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటి పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జేఏసీ నాయకులు మారగోని ప్రవీణ్ కుమార్ (ఏఐటీయూసీ) అధ్యక్షతన సంయుక్త సమావేశం జరిగింది. 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల రక్షణ చట్టం, నిర్మాణాల్లో వాడే ముడి సరుకులు పెరిగే ధరలను అరికట్టి, వాటిపై జీఎస్టీ పన్నును తొలగించాలనీ, సంక్షేమ బోర్డు ద్వారా వృద్ధాప్య ఫించన్ అమలుకోసం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రత్నాకరం కోటంరాజు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని విమర్శించారు. అందులో భాగంగా భవన నిర్మాణ కార్మికులు, కార్మిక సంఘాలు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను, హక్కులను పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నాలుగు కోడ్లుగా మారుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కోడ్లు అమలైతే ప్రస్తుతం రాష్ట్రాల్లో ఉన్న సంక్షేమ బోర్డులు, దేశవ్యాప్తంగా ఉన్న బోర్డుల్లో రూ.39,000 కోట్ల నిధులు పక్కదారి పట్టి దుర్వినియోగం అవుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం బోర్డు ద్వారా కార్మికులకు అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం అందకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల హక్కుల రక్షణ కోసం సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వంగూరు రాములు (సీఐటీయూ), జి.పరమేశ్వర్ (ఏఐటీయూసీ) జి.అనురాధ, ఎం.నాగేశ్వరరావు (ఐఎఫ్ టీయూ), నల్లన్న (ఐఎఫ్టీయూ), ఎండీ చాంద్ పాషా, విష్ణువర్థన్ రెడ్డి (స్వతంత్ర సెంట్రింగ్ యూనియన్) తదితరులు పాల్గొన్నారు.
21న రాష్ట్ర సదస్సు
సమ్మెను జయప్రదం చేసేందుకు మార్చి 21న ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర సదస్సు నిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ సదస్సులో భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్టు వెల్లడించారు.