Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటు రైతు.. ఇటు వినియోగదారుడికి నష్టం
- దోచుకుంటున్న వ్యాపారులు
- రోజుకు రూ.43.82 లక్షల నష్టం
- పట్టించుకోని ప్రభుత్వం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
చికెన్ ధరలు రోజురోజుకు పతాకస్థాయికి పెరుగుతున్నాయి. ధరలపై రాష్ట్ర ప్రభుత్వానికిగాని, అధికారులకు గాని నియంత్రణ లేకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజుకు రూ.44 లక్షల మేరకు అటు పౌల్ట్రీ రైతు, ఇటు వినియోగదారుడు నష్టపోతున్నాడు. ఇందులోనూ వ్యాపారులే అధికంగా లబ్దిపొందుతుంటే.. పౌల్ట్రీ రైతులకు మాత్రం నష్టాలు తప్పటంలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్కిన్లెస్ చికెన్ కిలో ధర రూ.300 దాటింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగితే చికెన్ ధరలు మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఇకనైనా రిటైల్ చికెన్ ధరలను నియంత్రించడంతోపాటు ఫారమ్ గేట్ వద్ద వ్యాపారులు అధికంగా కమిషన్ తీసుకోకుండా నియంత్రించాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 350 మంది పౌల్ట్రీ రైతులున్నారు. ప్రతి రోజు 66 వేల బ్రాయిలర్ కోళ్లు విక్రయిస్తున్నారు. ఇందులో 50 శాతం జిల్లాలో వినియోగిస్తుండగా, మరో 50 శాతం కోళ్లను హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. 45 రోజుల్లో 30 లక్షల కోళ్లను పెంచి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈ లెక్కన ఉమ్మడి వరంగల్ జిల్లాలో 66 వేల కిలోల చికెన్
వినియోగం జరుగుతుంది. నగరంలో స్కిన్లెస్ చికెన్ ధర కిలోకు రూ.300 దాటడంతో ప్రజలు చికెన్ అంటేనే భయపడుతున్న పరిస్థితి.
చికెన్ ధరలపై నియంత్రణేది..?
బ్రాయిలర్ చికెన్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ లేకపోవడంతో వినియోగదారులు తీవ్రంగా దోపిడికి గురవుతున్నారు. వెన్‌కాబ్ చికెన్ ధర (ఫారం గేట్) కిలోకు రూ.100.. అయితే వ్యాపారి రూ.7 కమిషన్‌ను తగ్గించి రూ.93కు కొనాల్సి వుండగా, రూ.20 తగ్గించి కేవలం రూ.80లకు కొను గోలు చేస్తున్నారు. పౌల్ట్రీ రైతుల నుంచి రూ.7ల కమిషన్‌కు బదులు రూ.20 కమిషన్ తీసుకోవడం గమనార్హం. దాంతో పౌల్ట్రీ రైతులు ప్రతిరోజు రూ.17.16 లక్షల మేరకు నష్టపోతున్నారు. వినియోగదారులపై కిలో స్కిన్లెస్ చికెన్‌కు రూ.40 అదనంగా దండుకోవడంతో రోజుకు రూ.26.66 లక్షల మేరకు వినియోగదారులు నష్టపోతున్నారు.
యుద్ధం కొనసాగితే.. చికెన్ ధరలు పైపైకి..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగితే చికెన్ ధరలు మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది. పౌల్ట్రీ, క్యాటిల్, ఫిషరీస్ షెడ్లలో దాణాగా సోయా, మక్కలను అధికంగా వినియోగిస్తారు. ఉక్రెయిన్ నుంచి సోయాను అధికంగా మన దేశానికి దిగుబడి చేసుకుంటున్నాం. యుద్ధంతో సోయా దిగుమతులు నిలిచిపోయాయి. అంతేకాదు, గతేడాది రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నను సాగు చేయొద్దని, వరి సన్నాలు సాగు చేయాలని ప్రకటించి, ప్రచారం చేసింది. ఈ క్రమంలో మొక్కజొన్న సాగును రైతులు గణనీయంగా తగ్గించారు. దాంతో ఇప్పటివరకు గోదాముల్లో ఉన్న మక్కల నిల్వలూ ఖాళీ అయ్యాయి. అడపాద డపా రైతులు అక్కడక్కడా మొక్కజొన్న సాగు చేసినా రాళ్ల వర్షాలతో పంట నష్టం సంభవించింది. మొక్కజొన్న సాగు తగ్గడం, దిగుబడి తగ్గడంతోపాటు ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధంతో సోయా దిగుబడులు నిలిచిపోవడంతో మున్ముందు దాణా ధరలు మరింత పెరిగి చికెన్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వ్యాపారుల కమిషన్‌ను నియంత్రించాలి
ఫామ్ గేట్ వద్ద బ్రాయిలర్ చికెన్ కిలోకు రూ.7 కమిషన్‌కు బదులు వ్యాపారులు రూ.20లు తీసుకుంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ లేదు. దాంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఫామ్ గేట్ వద్ద ధరలు, కమిషన్లపై నియంత్రణతోపాటు మార్కెట్లో రిటైల్ చికెన్ ధరల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. దీనికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అటు పౌల్ట్రీ రైతు, ఇటు వినియోగదారులకు న్యాయం జరగడంతోపాటు చికెన్ వినియోగం కూడా పెరుగుతుంది.
- త్రిపురనేని సుబ్రహ్మణ్యం,
రాష్ట్ర సంయుక్త కార్యదర్శి,
ఆలిండియా పౌల్ట్రీ ఫార్మర్స్ (బ్రాయిలర్) ఫెడరేషన్