Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏజీఎస్,టీజీఎస్, కేవీపీఎస్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశం నలుమూలల్లో అత్యంత ఎక్కువమంది అట్టడుగు ప్రజలు ఆరాధించే ఆదివాసి దేవతలైన సమ్మక్క, సారక్కలు దేవతలే కాదనీ, వారిని కోట్లాదిమంది ఆరాధించడం ఏమిటని తీవ్రంగా అవమానించిన చినజీయర్‌స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ హోలి పండుగ రోజే మార్చి 18న చినజీయర్ స్వామి దిష్టిబొమ్మల దగ్ధం చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణ గిరిజన సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఈ మేరకు గురువారం ఆయా సంఘాలు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఈ మేరకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడుసం భీంరావు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ గతంలో మాంసాహారం తినేవారిని అవమానిస్తూ మాట్లాడిన చినజీయర్ నేడు అట్టడుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం తన అహంభావాన్ని రుజువు చేసుకున్నాడని విమర్శించారు. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తన చెప్పు చేతల్లో ఉన్నారని రాజ్యాంగాన్ని ధిక్కరించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఆధ్యాత్మికత ముసుగులో అనేక మందిని అవహేళన చేయడమే గాక అక్రమ ఆస్తులు కూడబెట్టుకుంటూ మోసాలు చేస్తున్నాడని విమర్శించారు. కులవ్యవస్థ గురించి కూడా రాజ్యాంగేతర వ్యాఖ్యలు చేశాడని గుర్తు చేశారు. కోట్లాది మంది ప్రజలు సమ్మక్క-సారక్కను ఎందుకు ఆరాధిస్తారనీ, వాళ్లు దేవతలు కాదని వాళ్ళు అడవిలోని ఒక సామాన్యమైన వారనీ, అటువంటి వారికి కోట్లాది రూపాయలు ముడుపులు ఎందుకు సమర్పిస్తున్నారని అవహేళన చేస్తూ, కించపరుస్తూ చిన్నజీయర్‌స్వామి మాట్లాడారని విమర్శించారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో దొంగడేరాబాబాగా మారి, భక్తి ముసుగులో దేవుడే కానీ రామానుజుల వంటి వారి విగ్రహం పెట్టి వేల కోట్ల రూపాయలు దోపిడీకీ పాల్పడుతున్నాడని విమర్శించారు. దేవతల్లో కూడా బ్రాహ్మణ దేవతలు ఉన్నారని చెప్పి, దేవతలలో కూడా ఆధిపత్య దేవతలు అణగారిన కులాల దేవతలు ఉన్నారని వక్రభాష్యం చెప్పడం చిన్నజీయర్స్వామిలాంటి దొంగ బాబాలకే సాధ్యం అని విమర్శించారు. ఆదివాసీ గిరిజన సమాజాల్లో అడవుల్లో నివసిస్తున్న తమ వారి కోసం ప్రాణాలకు తెగించి పోరాడి అమరులైన వారిని దేవతలుగా కొలిచే సాంప్రదాయం ప్రాచీన కాలం నుండి వస్తున్నదన్నారు. అటువంటి ఆదివాసి గిరిజన దేవతలకు అతీత శక్తులు ఉంటాయని కోట్లాది మంది ప్రజల నమ్మకమని చెప్పారు. వారి నమ్మకాలను కించపరుస్తూ అవహేళన పరచడం చిన్నజీయర్‌స్వామి లాంటి దొంగ బాబాలకు చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన లేదని తెలుస్తున్నది అని అన్నారు. పురాతన ఋగ్వేదం నుంచి వైదిక పురాణ గ్రంథాలన్నిటిలోనూ ఆదివాసి వీరుల పోరాటం, దేవతలుగా కొలిచిన పద్ధతి గురించి చెప్పబడిందన్నారు. సమ్మక్క, సారక్కను కించపరుస్తూ అవహేళన చేసిన చిన్నజీయర్స్వామిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.