Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎగ్జామినర్లతో నిర్వహించేందుకు సన్నాహాలు
- బోర్డు నిబంధనలకు యధేచ్చగా తిలోదకాలు
- కార్పొరేట్ కాలేజీలకు అనుకూలంగా అధికారులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను ఇంటర్ బోర్డు అధికారులు ఇష్టారాజ్యంగా నిర్వహించేందుకు సన్నద్ధమవు తున్నారు. డిపార్ట్మెంటల్ అధికారుల్లే కుండానే ఈ పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది. కేవలం ఎగ్జామినర్లతోనే పరీక్షలను పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ప్రాక్టికల్ జరిగే పరీక్షా కేంద్రంలో డిపార్ట్మెంటల్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెండెంట్, ఎగ్జామినర్ తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్ బోర్డు ప్రతినిధిగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఉంటారు. ఎగ్జామినర్ ప్రయివేటు లేదా ప్రభుత్వ కాలేజీ అధ్యాపకులను నియమిస్తారు. ఈసారి ఇంటర్ బోర్డు ప్రతినిధి డిపార్ట్మెంటల్ ఆఫీసర్ లేకుండానే కేవలం ఎగ్జామినర్‌తో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. అధికారులు ఇంటర్ బోర్డు నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. వారి తీరు పలు అనుమానాలకు తావిస్తున్నది. రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీలకు అనుకూలంగా ఇంటర్ బోర్డు అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కైన అధికారులు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు లేకుండా నిర్ణయం తీసుకున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. గతంలో డిపార్ట్మెంటల్ అధికారుల నియామకంలోనూ అవకతవకలు జరిగినట్టు విమర్శలొచ్చాయి. సీనియర్లను కాకుండా జూనియర్లకు, అనుభవం లేని వారికి ఆ అవకాశం ఇచ్చినట్టు అధికారుల తీరుపై పలువురు అధ్యాపకులు ఆరోపించారు. ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ లేకుండానే నిర్ణయం తీసుకోవడాన్ని అధ్యాపక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్‌లో నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నా ఆచరణలో అమలు కావడం లేదు.
23 నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 23 నుంచి వచ్చేనెల ఎనిమిదో తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలను అధికారులు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాలు, ప్రశ్నాపత్రం తయారీ వంటి పనులపై అధికారులు నిమగమయ్యారు. ఈ పరీక్షలకు మూడు లక్షల మంది విద్యార్థులకుపైగా హాజరయ్యే అవకాశమున్నది. కరోనా నేపథ్యంలో గతేడాది ప్రాక్టిల్ పరీక్షలను నిర్వహించలేదు. కరోనా ప్రభావం లేకపోవడంతో ఈ పరీక్షలను నిర్వహించాలని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేకపోవడం వల్ల విద్యార్థులకు కొంత ఉపశమనం లభించింది. అందులోనూ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు మేలు కలిగింది. ఇంకోవైపు ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీల్లో ల్యాబోరేటరీలు ఉంటాయంటే అతిశయోక్తి అవుతుంది. అవి కేవలం నీట్, జేఈఈ, ఎంసెట్ కోచింగ్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తాయి. విద్యార్థులు ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తాయి. అందుకే ప్రాక్టికల్స్ కోసం ల్యాబ్‌లు ఉండే అవకాశం లేదు. మరోవైపు ల్యాబ్‌ల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న అంశం. అందుకే కార్పొరేట్ కాలేజీలు ఒక్కో విద్యార్థి నుంచి రూ.మూడు వేల వరకు ప్రాక్టికల్ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఫీజు వసూలు చేస్తాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం వచ్చే వారికి 'మామూళ్లు' ఇస్తాయన్న ఆరోపణలున్నాయి. అందుకే కార్పొరేట్ కాలేజీల్లో చదివే ఒక్కో విద్యార్థికి ప్రాక్టికల్ పరీక్షల మార్కులు 30కి 30 వస్తాయి. అదే ప్రభుత్వ కాలేజీల్లో ఎంత బాగా చదివిన విద్యార్థికైనా 30లోపు మార్కులే వస్తుండడం గమనార్హం.
డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించాలి : రామృష్ణగౌడ్, టిప్స్ కన్వీనర్
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ప్రయివేటు కాలేజీల్లో బోర్డు ప్రతినిధిగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించాలని తెలంగాణ ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి (టిప్స్) రాష్ట్ర కన్వీనర్, టిగ్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్‌ను గురువారం హైదరాబాద్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు. డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కచ్చితంగా ఉంటారనీ, అపోహలను నమ్మొద్దంటూ కార్యదర్శి హామీ ఇచ్చారని తెలిపారు.
డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు అవసరం లేదు : గౌరి సతీశ్, టీపీజేఎంఏ అధ్యక్షులు
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు అవసరం లేదని టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరి సతీశ్ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణలో వారికి ఎలాంటి పాత్ర ఉండబోదని పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి ప్రాక్టికల్ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఫీజు వసూలు చేసే కాలేజీలపైనా, ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించని కాలేజీలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పకడ్బందీగా ఈ పరీక్షలను నిర్వహించేందుకు ఫ్లైయింగ్ స్క్వాడ్లను నియమించాలని కోరారు. డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు థియరీ పరీక్షల వరకే పరిమితం చేయాలని సూచించారు.