Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటిని కూల్చడం సరికాదు: హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిజాం కాలం నాటి ఉస్మానియా ఆసుపత్రి భవనాలే ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయనీ, అదే ఆవరణలోని కొత్త భవనాల నాణ్యతే తక్కువగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి భవనాలను కూల్చడం సరికాదని వ్యాఖ్యానించింది. కూల్చివేతకే ప్రభుత్వం మొగ్గు చూపితే తాము వెంటనే ఆమోదం చెప్పబోమని తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికలో కూల్చివేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే తాము హెరిటేజ్ భవనాల పటిష్టతపై ఐఐటీ స్ట్రక్చరల్ ఇంజనీర్లు, ఆర్కియాలజీ నిపుణులతో కమిటీ వేసి రిపోర్టు తెప్పించుకుంటామని తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను తదుపరి విచారణలో అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఏప్రిల్ రెండో వారానికి వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా ఆస్పత్రిలోని హెరిటేజ్ బిల్డింగ్స్ కూల్చివేయాలనీ, కూల్చివేయరాదని పరస్పర విరుద్ధంగా దాఖలైన పిల్స్‌ను గురువారం హైకోర్టు విచారించింది. ఆస్పత్రిలో 26 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, ప్రస్తుతం భవనాలు 10 ఎకరాల్లో ఉండగా 16 ఎకరాలు ఖాళీ స్థలం అందుబాటులో ఉందనీ, హెరిటేజ్ భవనాల్ని కూల్చకుండా ఖాళీ స్థలంలో కొత్త భవనాలను నిర్మించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. హెరిటేజ్ బిల్డింగ్స్ కూల్చరాదని మరో న్యాయవాది కేఎస్ మూర్తి వాదించారు. హెరిటేజ్ భవనాల్లో పెచ్చులు ఊడిపడుతున్నాయని, ప్రజారోగ్యం దృష్ట్యా మళ్లీ కొత్త బిల్డింగ్స్ కట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని మరో న్యాయవాది వాదించారు. ఆర్ అండ్ బీ, మున్సిపల్ (ప్రజారోగ్య), పంచాయతీరాజ్ విభాగాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లతోపాటు జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్లతో ప్రత్యేక కమిటీ వేశామని, రెండు వారాల్లోగా రిపోర్టు వస్తుందని ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పారు.