Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నీ పనికిమాలిన మాటలే
- దమ్ముంటే మంత్రి గంగులపై గెలిచి చూపించు..:
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
- కరీంనగర్లో రూ.1025కోట్ల పనులకు శంకుస్థాపనలు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / కరీంనగర్‌టౌన్
కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచి మూడేండ్లయినా మూడు కోట్లు కూడా తీసుకురాలేదు. అడ్డిమారి గుడ్డి దెబ్బల గెలిచి గారెలబుట్టల పడ్డడు తప్ప జనం గోస ఏంటో తెలియదు.. డబ్బాల రాళ్లు వేసినట్టు ఎప్పుడూ హిందూముస్లిం అంటూ అమాయక జనంలో విషం నింపుడు..చిమ్ముడు తప్ప ఈ ప్రాంత ప్రజలకు పైసా పని చేయలేదు. జిల్లా ప్రజల కల అయిన మెడికల్ కాలేజీని రాష్ట్ర సర్కారు ఇచ్చిందే తప్ప కేంద్రం నుంచి త్రిబుల్ఐటీ, ఐఐటీ, కనీసం పాలిటెక్నిక్ కాలేజీ కూడా తెప్పించిన పాపాన పోలేదు.. దమ్ముంటే మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీచేసి గెలిచి చూపించు' అని కరీంనగర్ ఎంపీ బండి సంజరుపై ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె.తారకతామారావు సవాల్
విసిరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.615కోట్లు, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రూ.410కోట్ల పనులకు ఆయన గురువారం శంకుస్థాపనలు చేశారు. చొప్పదండిలోనూ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
జిల్లా కేంద్ర శివారులోని మార్క్‌ఫెడ్ మైదానంలో నిర్వహించిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. గతంలో ఎంపీగా ఉన్న బోయిన్పల్లి వినోద్‌కుమార్ హయాంలోనే కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ స్టేటస్ వచ్చిందని, తరువాత ఎంపీగా గెలిచిన సంజరు మూడేండ్లయినా మూడు కోట్ల పని అయినా చేయలేదన్నారు. పక్కనే సిరిసిల్ల చేనేత కార్మికులు మెగా పవర్లూమ్ క్లస్టర్ కావాలని 8ఏండ్లుగా అడుగుతున్నా.. కనీసం ఆ మాట పార్లమెంట్లో ఎత్తింది లేదన్నారు. హుజూరాబాద్, జమ్మికుంటలో చేనేత సముహాలు కావాలని, బ్లాక్ లెవర్ క్లస్టర్లు కావాలని ఆ ప్రాంత ప్రజలు అడుగుతున్నా.. స్థానిక ఎంపీకి సోయిలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చే ఆలోచన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేదునూర్‌లో అప్పటి కేంద్ర సర్కారు గ్యాస్ ఆధారిత ప్రాజెక్టు కోసం స్థలం లాక్కుందని, కనీసం ఆ ప్రాజెక్టు విషయమూ కేంద్రంతో మాట్లాడింది లేదని విమర్శించారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అరపైసా పని చేయలేదు..గానీ తెల్లారి లేస్తే కేసీఆర్‌ను తిట్టే పని పెట్టుకుంటున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆదర్శంగా నిలిచాయని కేటీఆర్ అన్నారు. దేశానికి అన్నం పెడుతున్న నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, మనం రూపాయి ఇస్తే.. అందులో 50పైసలు మాత్రమే మనకు ఇస్తున్నారని వివరించారు. కరీంనగర్లో ఏ పని మొదలు పెట్టినా విజయవంతం అవుతుందన్నారు. అందుకే కేసీఆర్ కరీంనగర్ అంటే లక్ష్మినగర్గా భావిస్తారని అన్నారు. తెలంగాణ రాకముందు 150 లోపున్న గురుకుల పాఠశాలలను 973కు పెంచి నాణ్యమైన విద్యను లక్షలాది మంది విద్యార్థులకు అందిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు ఎల్.పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ ఆర్వి.కర్ణన్ పాల్గొన్నారు.