Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకున్న రైతులు
- నష్టపరిహారం ఎంతో తేల్చాలి
- కార్పొరేట్ల కోసమే గ్రీన్ ఫీల్డ్ హైవే
నవతెలంగాణ-ఎర్రుపాలెం
నాగపూర్ నుంచి అమరావతి వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూములు నష్టపోతున్న నిర్వాసితులు, రైతులకు ఎటువంటి సమాచారం అందించకుండా ఎకరానికి ఎంత నష్ట పరిహారం తేల్చకుండా రైతుల భూములను ఎలా సర్వే చేస్తారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు సర్వే అధికారులను ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల, కొత్తపాలెం గ్రామాల రైతుల భూములు సర్వేకు వచ్చిన అధికారులను సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రెండు గ్రామాల రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఈ నెల 15న మధిర మండలం సిరిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా భూములు ఇచ్చేది లేదని రైతులు, నిర్వాసితులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారని గుర్తుచేశారు. అటువంటి పరిస్థితుల్లో రైతులకు ఎటువంటి సమాచారం అందించకుండా భూముల సర్వేను చేయడానికి మీరు ఎలా వచ్చారని అధికారులను నిలదీశారు. నేషనల్ హైవే వల్ల పంట భూములు, అంతర్గత రోడ్లు, ఆస్తులు కోల్పోవాల్సి వస్తుందని ప్రజలు అభ్యంతరం తెలుపుతున్నారని అన్నారు. జాతీయ రహదారుల వల్ల ఖమ్మం జిల్లా ప్రజలకు ప్రయోజనం ఏమీ లేదని కార్పొరేట్ల ఎదుగుదలకు, వారి వ్యాపార లావాదేవీలకు దోహదపడే విధంగా గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదన తెచ్చారని విమర్శించారు. సాగర్ కాలువ జలాలు కింద మూడు పంటలు పండే భూములను రైతులు కోల్పోవాల్సి వస్తుందని సారవంతమైన భూములను రైతుల నుంచి గుంజేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నేషనల్ హైవేల పేరుతో పేద ప్రజల భూములను గుంజుకునే ఆలోచన మానుకోవాలని హితవు పలికారు. లేకుంటే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు మాదినేని రమేష్, కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య, రేమిడిచర్ల గ్రామ సర్పంచ్ చెన్నం రాజు పురుషోత్తం రాజు, కత్తి మోహన్ రావు, బోర్ర మురళి, లగడపాటి అప్పారావు, గామాసు జోగయ్య పాల్గొన్నారు.