Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షమాపణ చెప్పాలని సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చినజీయర్‌స్వామి ప్రజల నమ్మకాలు, ఆహారాలు, కులాలు, వృత్తులపైన బాధ్యతా రహిత మైన వ్యాఖ్యలు చేస్తూ, అవమానపర్చడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. తక్షణమే ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించు కొని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమ్మక్క, సారలమ్మల గురించి చినజీయర్‌స్వామి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఆదివాసీలతోపాటు, సాధారణ ప్రజలు వారిని దేవతలుగా పూజిస్తున్నారని వివరించారు. ఎవరి నమ్మకం వారిదనీ, చినజీయర్కి వారిమీద నమ్మకం లేకపోవచ్చునని తెలిపారు. కానీ ఆయన నమ్ముతున్న రామానుజుడూ ఆనాటి పరిస్థితుల్లో ఎంతో కొంత సమభావన పంచినందుకే ఇప్పుడు పూజలందుకుంటున్నారని పేర్కొన్నారు. 'ఎవరు దేవుడు, ఎవరు కాదు' అన్న చర్చ అప్రస్తుతమని తెలిపారు. ఇది నమ్మకాలకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. కాకతీయుల కాలంలో పన్నుల భారాన్ని సమ్మక్క, సారలమ్మలు ప్రతిఘటించారంటూ చెబుతారని వివరించారు. అందుకే వారు ఆదివాసీల ఆరాధ్యులైనారంటూ ప్రతీతి అని తెలిపారు. ఇలాంటి వారిమీద చినజీయర్ వ్యాఖ్యలు ఆధిపత్య ధోరణి తప్ప మరొకటి కాదని విమర్శించారు. గతంలోనూ ఆయన అగ్రకుల ఆధిపత్య ధోరణులను ప్రదర్శిం చారని పేర్కొన్నారు. మాంసాహారం తినేవారిపట్ల నీచంగా వ్యాఖ్యానించారని తెలిపారు. గొర్రెమాసం తినేవారికి గొర్రె ఆలోచనలు, కోడి మాంసం తినేవారికి కోడి ఆలోచనలు, పందిమాంసం తినేవారికి పంది ఆలోచనలే ఉంటాయన్నారని గుర్తు చేశారు. కుల వ్యవస్థ కొనసాగాలన్నారని పేర్కొన్నారు. ఎవరి వృత్తి వారే చేయాలన్నారని వివరించారు. ఇవి కుల దురహంకార ధోరణులు తప్ప మరొకటికాదని విమర్శించారు. సమాజంలో సున్నితమైన భావోద్వేగాలున్న సమయంలో చినజీయర్ ఏ ప్రయోజనం ఆశించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో ప్రజాస్వామ్యవాదులంతా పరిశీలించాలని కోరారు. ఇప్పటికైనా ఆయన ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు.