Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్‌పై హైకోర్టు ఆగ్రహం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపట్టేలా ఆదేశించాలని కోరుతూ 2015లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.. దాదాపు ఏడేండ్లు గడిచినా కౌంటర్ దాఖలు చేసే తీరిక లేదా అని ప్రశ్నించింది. చివరి అవకాశంగా ఆరు వారాలు గడువు ఇస్తున్నామని చెప్పింది. ఈసారి కౌంటర్ దాఖలు చేయకపోతే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఆ పదవిని నిర్వహిస్తున్నారు) వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావలిలతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్రమించిన భూములను క్రమబద్దీకరించేలా 2014లో ప్రభుత్వం జారీచేసిన జీవో 59ని చట్టవిరుద్దంగా ప్రకటించాలని, అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ నగరానికి చెందిన అన్వర్‌ఖాన్ మరొకరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోకుండా వాటిని క్రమబద్దీకరించేలా జీవో జారీ చేయడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్ తరఫు లాయర్ చిక్కుడు ప్రభాకర్ వాదించారు. ఇదే విధానాన్ని ఆమోదిస్తే ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతుందని, క్రమబద్ధీకరణ అవుతుందనే ఆశతో ఆక్రమణలకు పాల్పడే ప్రమాదం ఉంటుందన్నారు. ఏడేండ్లుగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. తదుపరి విచారణను జూలై 20కి వాయిదా వేసింది.