Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిభావంతులకు ఫీజు రాయితీ
- సబ్జెక్టు పట్ల రాజీపడొద్దు : చుక్కా రామయ్య
- యంత్రాలుగా మారుస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు : నర్సిరెడ్డి
- పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం : దయాకర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రగతినగర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 'ప్రగతి ఐఐటీ-జేఈఈ, నీట్ అకాడమి' స్కాలర్షిప్ పరీక్ష వచ్చేనెల మూడో తేదీన జరగనుంది. హైదరాబాద్‌లో ప్రగతినగర్‌లో ఉన్న ప్రగతి సెంట్రల్ స్కూల్లో, మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు https://pragathicollege.co.in వెబ్‌సైట్‌ను సంప్రదించి వచ్చేనెల మూడో తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశమున్నది. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ ఐఐటీ ప్రశ్నాపత్రంలో ప్రశ్నలను ఎలా తిప్పి అడుగుతారో ఖరగ్‌పూర్ ఐఐటీకి వెళ్లిన తర్వాత అర్థమైందన్నారు. సబ్జెక్టులో ఉండే రహస్యాలను విద్యార్థులకు వివరించాలని సూచించారు. అప్పుడే విద్యార్థులు ప్రశ్న ఎలా వచ్చినా జవాబు రాయగలరనీ, వారి మేధస్సు బయటపడుతుందని అన్నారు. ప్రశ్నలోని చిక్కుముడులను విప్పేలా వారిని తీర్చిదిద్దాలని చెప్పారు. సబ్జెక్టును చెప్పడంలో, ప్రతిభ ఉన్న విద్యార్థులను చేర్చుకోవడంలో రాజీపడొద్దని కోరారు. పునాది సరిగ్గా లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతం, పేద విద్యార్థులు ఎక్కువ మంది ఐఐటీకి ఎంపికయ్యే వారు కాదన్నారు. విద్యార్థుల ఎంపికలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలనీ, పేద విద్యార్థులకు న్యాయం జరగాలని కోరారు. వారు దేశానికి, సమాజానికి ఉపయోగపడతారని అన్నారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రయివేటు విద్యాసంస్థలు అందిస్తున్నది విద్యేనా?అన్న ప్రశ్న వస్తున్నదని చెప్పారు. పాఠ్యాంశాలే కాకుండా సమాజాన్ని, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని అన్నారు. కానీ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను జీవం ఉన్న యంత్రాలుగా మార్చి పుస్తకాలు, పరీక్షలు, మార్కులు, ర్యాంకుల కోసమే చదవాలన్నట్టుగా తయారు చేస్తున్నారని వివరించారు. ఇంటర్ విద్య చాలా కీలకమని అన్నారు. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్ విద్య అందించేందుకు ప్రగతినగర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ముందుకు రావడం అభినందనీయమన్నారు. నాణ్యమైన విద్యను అందించి నిజమైన పౌరులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. కార్పొరేట్ విద్యావ్యాపారం మూడు పువ్వులు, పదహారు కాయలుగా వికసిస్తున్నదని చెప్పారు. కమీషన్లు అందుతున్నాయేమో, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అంతర్గత భాగస్వాములేమో అన్న అనుమానాలున్నాయని అన్నారు. ఏడేండ్ల కింద, అధికారంలోకి వచ్చాక మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనమని వివరించారు. ప్రగతినగర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కరస్పాండెంట్ డి దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రగతి సెంట్రల్ స్కూల్లో సీబీఎస్ఈ, రాష్ట్ర సిలబస్‌ను బోధిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు 600 మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామనీ, రాబోయే 15 ఏండ్లలో 25 వేల మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని చెప్పారు. ప్రతి గ్రామం ఓ పేద విద్యార్థికి విద్య అందిస్తామన్నారు. ఇప్పుడు నాలుగు జూనియర్ కాలేజీలను ప్రారంభిస్తున్నామనీ, భవిష్యత్తులో డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలను ప్రారంభిస్తామని అన్నారు. విలువలతో కూడిన ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తామని ప్రగతి ఐఐటీ, నీట్ అకాడమి అకడమిక్ డైరెక్టర్ సాంబశివరావు, జనరల్ మేనేజర్ టి నరేష్ చెప్పారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఫీజులో రాయితీ కల్పిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా మొదటి మూడు ర్యాంకులు సాధించిన వారికి 90 శాతం, ఆ తర్వాత వారి ప్రతిభ, నేపథ్యం ఆధారంగా ఫీజు రాయితీ ఉంటుందని వివరించారు.