Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెక్‌డ్యాం వాగులో విద్యార్థి.. అడ ప్రాజెక్టులో యువకుడు
- మంథనిలో బాలుని కుటుంబ సభ్యుల ఆందోళన
నవతెలంగాణ - మంథని/ఆసిఫాబాద్
హోలీ వేడుకలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. రంగులు చల్లుకున్న అనంతరం స్నానానికెళ్లిన ఇద్దరు నీటిలో మునిగిపోయి మృతిచెందారు. ఈ ఘటనలు పెద్దపల్లి, కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం జరిగాయి.
మంథనిలో చెక్‌డ్యామ్ నిర్మాణం కోసం వాగులో తీసిన గుంతలో పడి ఓ విద్యార్థి ప్రాణం కోల్పోయాడు. చెక్‌డ్యామ్ నిర్మాణ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాలుడి బంధువులు ఆందోళన చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయిన్‌పేట గొల్లవాడకు చెందిన ఎరవెన కొమురయ్య కుమారుడు ముఖేష్(14) శుక్రవారం హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం స్నేహితులతో కలిసి బొక్కలవాగులో స్నానానికి వెళ్లాడు. ఈ క్రమంలో వాగులో ఉన్న గోతిలో పడి నీట మునిగాడు. స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. తర్వాత ముఖేష్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనా స్థలం వద్ద కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. అక్కడే ఉన్న జేసీబీ అద్దాలను ధ్వంసం చేశారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. కుటుంబీకులు మృతదేహాన్ని నేరుగా మంథని అంబేద్కర్ చౌక్ వద్దకు తీసుకొచ్చి ఆందోళన చేశారు. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అంబేద్కర్ చౌక్‌లో బైటాయించారు. మంథని సీఐ సతీష్, ఎస్ఐ చంద్రకుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. మృతుడు ముఖేష్ మంథనిలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
అడ ప్రాజెక్టులో పడి యువకుడు మృతి
కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా అడ ప్రాజెక్టులో పడి రాజస్థాన్‌కు చెందిన దినేశ్ కుమార్(20) మృతిచెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్ మండలంలో ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో పని చేస్తున్న దినేశ్‌కుమార్ శుక్రవారం స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రానికొచ్చి వచ్చి హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం స్నేహితులతో కలిసి ఆడ ప్రాజెక్టును వెళ్లాడు. ఈ క్రమంలో డ్రాప్వాల్ కింద స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు లోతు నీళ్లలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో మృతి చెందాడు. స్నేహితులు వెంటనే బంధువులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లతో గాలించి.. మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.