Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోడిగుడ్ల ధరలపై నియంత్రణ కరువు
- రైతుకు రూ.32.56 లక్షల నష్టం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పౌల్ట్రీ రంగంలో జరుగుతున్న దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. చికెన్, కోడిగుడ్ల ఉత్పత్తిపై రైతుకు లాభం రాకపోగా నష్టం వాటిల్లుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉత్పత్తి అయ్యే సుమారు 22 లక్షల గుడ్లపై రిటైల్ వ్యాపారులు తమ కమీషన్‌కు అదనంగా రోజుకు రూ.33 లక్షల నుంచి రూ.44 లక్షలు లాభం సంపాదించడం గమనార్హం. కోళ్ల పరిశ్రమ నాలుగు రకాలుగా ఉంటుంది. బ్రీడర్స్, హ్యాచరీస్, కోళ్ల దాణా తయారీ కంపెనీలు, కోళ్ల మందుల కంపెనీలు, వ్యాక్సినేషన్ కంపెనీలు. వీళ్లు ఉత్పత్తి చేస్తున్న ధరలపై ప్రభుత్వాల నియంత్రణ లేదు. ఈ కంపెనీలన్నీ సిండికేట్‌గా ఏర్పడి ధరలను నిర్ణయించి అమలు చేస్తు న్నాయి. దాంతో సగటు పౌల్ట్రీ రైతులు ఆర్ధికంగా చితికి పోతున్నారు. 'నెక్' ధరలను ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువగా నిర్ణయించడం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో 100 మంది లేయర్ బర్డ్స్ రైతులు రోజుకు రూ.32.56 లక్షల నష్టాన్ని చవిచూస్తు న్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 100 లేయర్డ్ బర్డ్స్ ఫామ్స్ ఉన్నాయి. వీటిలో 39 లక్షల లేయర్ బర్డ్స్ ఉన్నా యి. లేయర్ బర్డ్ జీవితకాలం 12 నెలలు. 12 నెలల్లో 310 గుడ్లు పెడు తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క రోజు 22-30 లక్షల కోడిగుడ్లు ఉత్పత్తవుతాయి. చలి కాలంలో 30 లక్షల గుడ్లు, వేసవిలో 20-22 లక్షల గుడ్డు మాత్రమే ఉత్పత్తి అవుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 లక్షల కోడిగుడ్ల వినియోగం ఉంటోంది. ఇందులో మధ్యాహ్న భోజనం పథకానికి రోజూ 1.20లక్షల గుడ్లు, అంగన్వాడీ కేంద్రాలకు రోజుకు 60 వేల గుడ్లు వినియోగిస్తున్నారు. మరో 10-12 లక్షల్లో.. ప్రతిరోజూ.. 8-10 లక్షల కోడిగుడ్లు.. ముంబయి, నాగ్‌పూర్‌కు సరఫరా చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు రోజుకు 2-4 లక్షల కోడిగుడ్లను తరలిస్తున్నారు.
రైతులకు రూ.32.56 లక్షల నష్టం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వినియోగిస్తున్న 12 లక్షల కోడిగుడ్లపై రిటైల్ వ్యాపారులు తమ కమీషన్‌కు అదనంగా రోజుకు రూ.18 లక్షల నుంచి రూ.24 లక్షలు లాభం పొందడం గమనార్హం. ఒక కోడిగుడ్డు ఉత్పత్తి ఖర్చు సగటున రూ.5.02 (ప్రస్తుత దాణా ఖర్చుల ఆధారంగా) అవుతుంది. మార్కెట్లో నెక్ ధర రూ.3.64లు ఉంది. ఇందులో కమిషన్ 10 పైసలు పోగా రూ.3.54లకు రైతు నుంచి కోడిగుడ్డును హోల్‌సేల్ డీలర్లు కొనుగోలు చేస్తున్నారు. రిటైల్ మార్కెట్లో కోడిగుడ్డు ధర 5 నుంచి 6 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. కమీషన్ పోగా అదనంగా రూ.1.26-రూ.2.26లు అదనంగా కమీషన్ దండుకుంటున్నారు. ఫామ్ గేట్ నుంచి గుడ్లను సేకరించి హోల్‌సేల్ డీలర్ 20 పైసలు కమీషన్ తీసుకుంటున్నాడు. ఇక్కడ దోపిడీ లేదు. రిటైల్ వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచి కమీషన్‌కు అదనంగా ధరలు పెంచి దోచుకోవడంతో వినియోగదారులు బెంబెలెత్తుతున్నారు.
ఇంటిగ్రేటెడ్ విధానంతో రైతులకు తీవ్ర నష్టం
లేయర్ బర్డ్స్ వ్యాపారంలో బ్రాయిలర్ బర్డ్స్ వ్యాపారులు ప్రవేశించినట్టు.. ఇంటిగ్రేటెడ్ కంపెనీలు రంగ ప్రవేశం చేస్తుండటంతో పౌల్ట్రీ రైతులు కకావికలమవుతున్నారు. 'స్నేహా' ఫామ్స్ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫార్మ్స్ ఏర్పాటు చేసి కోడిగుడ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ కోడిగుడ్లను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్నేహా చికెన్ సెంటర్లలో రిటైల్‌గా విక్రయిస్తున్నారు. ఇదే తరహాలో మరిన్ని కంపెనీలు ఈ రంగంలోకి వస్తే పౌల్ట్రీ రంగంలో ఉన్న చిన్న రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
దాణా ధరలు పెరిగితే గుడ్డు ధరలు మరింత పైకి..
ప్రస్తుతం ఉన్న దాణా ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. అలా జరిగితే కోడిగుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశముంది. లేయర్ కోళ్లకు దాణాగా వినియోగించే సోయా దిగుమతులు లేకపోవడం, మక్కల సాగు తగ్గి దిగుబడులు తగ్గడంతో దాణా ధరలు తారాస్థాయి చేరే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కోడిగుడ్డు ధర రిటైల్‌గా రూ.5 నుంచి రూ.6లుగా ఉంది. దాణా ధరలు పెరిగితే కోడిగుడ్లు కొనాలంటేనే వినియోగదారులు బెంబెలెత్తే పరిస్థితి తలెత్తే అవకాశముంది.
రిటైల్ వ్యాపారుల దందాను అరికట్టాలి
లేయర్ పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలంటే కోడిగుడ్డు ఉత్పత్తి ధరలకు అదనంగా 'నెక్' ధరలు నిర్ణయించేలా చూడడంతోపాటు రిటైల్ వ్యాపారులు ధరలు ఇష్టమొచ్చినట్టు నిర్ణయించకుండా నియంత్రించే వ్యవస్థను ఏర్పాటు చేస్తే అటు పౌల్ట్రీ రైతులు, ఇటు వినియోగదారులు సంతృప్తి చెందుతారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (నెక్)పై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడం, అవసరానికి మించి కోళ్లు, గుడ్ల ఉత్పత్తి జరగడం కూడా ఈ మార్కెట్లో సంక్షోభానికి కారణం. అటు ఉత్పత్తిపై, ఇటు ధరలు, కమీషన్‌పై నియంత్రణ వ్యవస్థను తక్షణమే ఏర్పాటు చేసి ఆదుకోవాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు.