Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసన ప్రదర్శనలకు సీపీఐ(ఎం) పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ చార్జీలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు వేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. తక్షణమే పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేయాలని పార్టీ శ్రేణులకు సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని ఎంబీ భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు ప్రదర్శన ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినరీ బస్సుల్లో 10 కిలోమీటర్ల నుంచి, మెట్రో ఎక్స్ప్రెస్ల్లో ఆరు కిలోమీటర్ల నుంచి, మెట్రో డీలక్స్‌లో నాలుగు కిలోమీటర్ల నుంచి ఐదు రూపాయల చొప్పున టిక్కెట్ ధరలు పెంచి ప్రజలపై భారం వేస్తున్నదని వివరించారు. పల్లెవెలుగు బస్సుల్లో రూ.13 ఉన్న టిక్కెట్ ధరను రూ.15కు, రూ.17, రూ.18 ఉన్న టిక్కెట్ ధరను రూ.20కి
పెంచిందని తెలిపారు. దీనికి తోడు టోల్‌ఫ్లాజా చార్జీలనూ ప్రజల నుంచి అదనంగా వసూలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఇది ప్రజా రవాణా అయిన ఆర్టీసీపై ఆధారపడి ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారమే అవుతుందని తెలిపారు. ఆర్టీసీ నష్టాల బాటనుంచి గట్టెక్కించడానికి బడ్జెట్లో సరిపోయినన్ని నిధులు కేటాయించి సంస్ధను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు. కానీ నేడు ఆర్టీసీ ఆస్తులను ప్రయివేటువారికి కట్టబెట్టి, ప్రయాణ టిక్కెట్టు రేట్లు పెంచి పూడ్చుకోవాలని చూస్తున్నదని విమర్శించారు. దీంతో ఆ సంస్థ ఆస్థులను కోల్పోవడమే కాకుండా, ప్రజలపై పెనుభారం పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ నష్టాలను ప్రజల మీద రుద్దకుండా కొన్ని రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలే భరిస్తున్నాయని వివరించారు. ప్రజలకు రాయితీలనూ అందిస్తున్నాయని తెలిపారు. అందువల్ల తక్షణమే రెండు శాతం నిధులు కేటాయించి ఆర్టీసీని ఆదుకోవాలనీ, పెంచిన టిక్కెట్ ధరలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.