Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూరాలలో 3.5 టీఎంసీలు
- శ్రీశైలంలో 30 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం
- గతేడాదితో పోల్చితే తగ్గిన నీటి నిల్వలు
- పాత గేట్లతో నీరు వృథా
- ఆరుతడి పంటలకు నీరు నిలిపివేత
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
మార్చిలోనే ఎండలు ముదిరాయి.. తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ క్రమంలో జలాశయాలూ ఖాళీ అవుతున్నాయి. వర్షాకాలంలోనేమో.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా వందల టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో జిల్లాలో సాగు, తాగునీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. జూరాలతోపాటు శ్రీశైలం జలాశయాలు గతేడాదితో పోల్చితే ప్రస్తుతం నీటి నిల్వలు భారీగా తగ్గాయి. గతేడాది మార్చిలో జూరాలలో 4 టీఎంసీల నీరుండగా.. ప్రస్తుతం మూడున్నరకు చేరింది. ఈ నిల్వలు మరింత తగ్గి ఆరు తడి పంటలకే కాకుండా తాగునీటికీ ఇబ్బందికర పరిస్థితులు దాపురించే అవకాశాలున్నాయి. ఎండలకు తోడు రిజర్వాయర్లకు అమర్చిన క్రస్ట్ గేట్లు పాతవి కావడంతో లీకులు ఏర్పడి నీరంతా దిగువకు వెళ్తోంది. ఫలితంగా నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. పరిస్థితి ఇలాగే, కొనసాగితే నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదాలున్నాయని, కనీసం తాగు నీటి అవసరాలూ తీర్చలేని దుస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.04 టీఎంసీలకు పడిపోయింది. దీంతో నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమాకు నీటి
విడుదల నిలిపేశారు. తాగునీటి అవసరాల కోసం 1.690 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గతేడాది జూరాలలో ఈ సమయానికి 4 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. శ్రీశైలం పూర్తి సామర్థ్యం 215.81టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 30 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గతేడాది ఇదే సమయంలో 4 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అలాగే, శ్రీశైలం జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 315 టీఎంసీలు. అది క్రమంగా 215 టీఎంసీలకు చేరింది. అంటే వంద టీఎంసీల మందంగా బురద చేరింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల నీటి నిల్వలు 30 టీఎంసీల డెడ్ స్టోరేజీకి చేరాయి. ఈ నీరు కూడా క్రమ క్రమంగా ఆవిరి అవుతోంది. ఫలితంగా నీటి నిల్వలు మరింత తగ్గే అవకాశం ఉంది.
ఉమ్మడి జిల్లాలో కోయిల్‌సాగర్, సింగోటంతోపాటు వనపర్తి జిల్లా పరిధిలో సప్త సముద్రాల పేరుతో 7 రిజర్వాయర్లున్నాయి. ఇంకా గుడిపల్లి, జొన్నలబొగడ, ఎల్లూరు రిజర్వాయర్లు ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పరిధిలో నిర్మిస్తున్న రిజర్వాయర్లు ఇంకా పూర్తి కాలేదు. నీటి సమస్య కారణంగా ఈ ఏడాది రబీకి సాగునీటిని మధ్యలోనే నిలిపేశారు. ఉమ్మడి జిల్లాలో 6,536 చెరువులు నీరు లేక వెలవెలబోతున్నాయి. జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవడంతో జలాశయాలు ఆవిరి రూపంలో తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో సుమారు రెండున్నర లక్షల ఎకరాల వేరుశనగ, మరో లక్ష ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా ఎండుదశకు చేరుకుంది.
ముందస్తు చర్యలు లేకనే నీటి సమస్య
జూరాల, శ్రీశైలంలో ఇప్పటికే కనిష్ట స్థాయికి నీటి నిల్వలు పడిపోయాయి. జూరాల గేట్లు కొత్తవి అమర్చకపోవడం వల్ల ప్రతి రోజూ నీరు లీకేజీ అవుతోంది. 20 ఏండ్ల కిందట అమర్చిన గేట్లకు కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. జూరాలకు అమర్చిన 17, 20, 36 గేట్ల నుంచి నిరంతరం నీరు లీకవుతూనే ఉంది. వరదల సమయంలో నీటిని రిజర్వాయర్ల ద్వారా నింపుకుంటే సమస్య వచ్చేది కాదు. 40 టీంఎంసీలకుగానూ కేవలం 6 టీఎంసీలను నిల్వ చేసుకుంటున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇంకా 15 రిజర్వాయర్లను నిర్మాణం చేయాల్సి ఉంది.
మరమ్మతులు చేపట్టాలి
ఎండీ.జబ్బార్- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి- వనపర్తి
బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారిన జూరాల విషయంలో పాలకులు వివక్ష చూపుతున్నారు. నిర్వహణ కోసం నిధులు ఏమాత్రం ఖర్చు చేయడం లేదు. గేట్ల మరమ్మతులు చేయకపోవడంతో నీరంతా వృథాగా పోతోంది. జూరాలతో పాటు మిగతా ప్రాజెక్టుల నిర్వహణ కోసం నిధులు పెంచి ఖర్చు చేయాలి. లేకుంటే నీటి సమస్య జఠిలంగా మారే అవకాశం ఉంది.