Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల జీవితాలతో చెలగాటం : టిగ్లా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీలతో ఇంటర్ బోర్డు అధికారులు కుమ్మక్కయ్యారని తెలంగాణ ఇంటర్మీడియెట్ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం (టిగ్లా) విమర్శించింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతు న్నారనీ, ఉద్యోగుల హక్కులను హరిస్తున్నారని తెలిపింది. ఈ మేరకు టిగ్లా అధ్యక్షులు ఎం జంగయ్య, ప్రధాన ఆర్యదర్శి మాచర్ల రామకృష్ణగౌడ్ శుక్రవారం
ఒక ప్రకటన విడుదల చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతుల్లేకుండా ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీలు విచ్చలవిడిగా నడుస్తున్నాయని విమర్శించారు. వాటిని నివారించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. నిబంధనలు పాటించకుండా, అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. అకడమిక్ క్యాలెండర్ను పాటించకుండా కనీసం విద్యార్థులకు ప్రాక్టికల్స్ అంటే ఏంటో తెలియకుండా, రికార్డులు రాయకుండా చేస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని వివరించారు. డిపార్ట్మెంటల్ అధికారులను నియమిస్తే వాస్తవ విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. ఎండల నేపథ్యంలో విద్యార్థులకు ఆరోగ్య, మానసిక సమస్యలు ఎదురవుతాయనీ, ఇంటర్ బోర్డు అనాలోచిత నిర్ణయానికి వారు బలికావాల్సి వస్తుందని పేర్కొన్నారు. డిపార్ట్మెంటల్ అధికారులను నియమించకపోతే భవిష్యత్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.