Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు వ్యవస్థ రద్దు ఉత్తిదే...
- వైద్యశాఖలో ఒప్పంద నియామకాలే...
- ప్రభుత్వతీరుపై వైద్య సంఘాల్లో అసంతృప్తి
- సీఎం దృష్టికి తీసుకెళ్లాలని యోచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలం నుంచి చెబుతున్న కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు ఇప్పటికీ అమలు కాలేదు. తాజాగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించినా ఆచరణలో మాత్రం అది కనిపించడం లేదు. మనిషి ఉన్నంత కాలం ఆరోగ్యం అవసరమనీ, ఆ ఆరోగ్య పరిరక్షణ కోసం పని చేసే సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన తీసుకోవడం సరికాదంటూ నిపుణులు చేసిన సూచనలు బేఖాతరు చేస్తున్నారు. కోవిడ్-19 కాలంలో తాత్కాలిక సిబ్బందిని నియమించుకుని తొలగించిన విషయం విదితమే. ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించినందుకు గుర్తింపు దక్కకపోగా ఉద్యోగాలు కోల్పోవడంతో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నుంచి సర్కారు విమర్శలనెదుర్కొన్నది. తాత్కాలిక స్కీంల పేరుతో అమలవుతున్న పలు పథకాల్లో దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నారు. అందులో పని చేస్తున్న వారిలో అత్యధికంగా ఒప్పంద లేదా పొరుగు సేవల ప్రాతిపదికన నియమితులైన వారే. అరకొర జీతాలతో అవస్థలు పడుతున్న వారే ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం ఈ తీరును మార్చుకోవాలని వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నాయి.
తాజాగా గాంధీ వైద్య కళాశాల, ఆస్పత్రిలో 135 డాక్టర్ల పోస్టులకు ఒప్పంద పద్ధతిలో నియమించుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై డాక్టర్ల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది. జనరల్ మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్, అనస్తీషియా, గైనకాలజీ విభాగాల్లో 20, ఆర్థోపెడిక్ లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 20 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి ఇక మీదట రెగ్యులర్ నియామకాలే ఉంటాయని ప్రకటిస్తుంటే మరోవైపు కాంట్రాక్టు నోటిఫికేషన్ ఇవ్వడమేంటని పలు డాక్టర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆరోగ్య తెలంగాణ లక్ష్యానికి ఇలాంటి నోటిఫికేషన్లు అటంకంగా మారుతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పదవీ విరమణ వయస్సును పెంచడంతో కొత్త పోస్టులు రావడానికి మరింత సమయం పట్టనున్నది. దీనికి తోడు పాత మెడికల్ కాలేజీలతో పాటు కొత్త మెడికల్ కాలేజీల్లో ఖాళీలను కూడా కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తుండటంతో నిరుద్యోగ వైద్య అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిత్తశుద్ధి లేకపోవడమే....డాక్టర్ రాజీవ్
పోస్టుల భర్తీపై చిత్తశుద్ధి లేకపోవడంతోనే ప్రభుత్వం కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలంటూ నోటిప ˜ికేషన్ విడుదల చేసిందని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం సలహాదారు డాక్టర్ రాజీవ్ విమర్శించారు. సర్వీస్ కోటా కింద పీజీ పూర్తి చేసుకున్న వారిని డీహెచ్ విభాగం నుంచి డీఎంఇ విభాగంలోకి ఒకరిని తీసుకునే ముందు ముగ్గురు రెగ్యులర్ నియామకమై ఉండాలని కోర్టు తెలిపిందన్నారు. దీంతో ప్రభుత్వం రెగ్యులర్ నియామకాలు చేపడుతుందని తామంతా భావించామనీ, అసెంబ్లీ సీఎం కేసీఆర్ ఇక మీదట కాంట్రాక్టు నియామకాలు ఉండవని చెప్పిన మరుసటి రోజే నోటిఫికేషన్ విడుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కోసం కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ అంటే డాక్టర్లు ముందుకు రారనీ, దీంతో మరో సారి ప్రభుత్వం డాక్టర్లు ఆసక్తి లేరని నెపం వారిపై నెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనివార్యమైన నియామకాల్లో జాప్యం జరుగుతుందనీ, తద్వారా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తగినంత మంది లేకుంటే మెడికల్ పీజీ సీట్లకు నష్టం తప్పదని హెచ్చరించారు. రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.