Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేషనలైజేషన్ పేరుతో చార్జీల పెంపు
- టోల్ చార్జీలూ పెంచేశారు
- సిటీ బస్సుల్లో రూ.5 పెంపు
- కొత్తగా సేఫ్టీ సెస్...
- సామాన్యుల ప్రయాణం మరింత భారం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ బస్సు టిక్కెట్ల రేట్లు పెరిగాయి. కాకపోతే దానికి 'పెంపు' అనే పదాన్ని వాడకుండా, సామాన్యులకు అర్థంకాని 'హేతుబద్ధీకరణ' (రేషనలైజేషన్) అని పేరు పెట్టారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్‌కు సరిపడా చిల్లర సమస్య వస్తున్నందున టిక్కెట్ ధరను రూ.5, రూ.10 విలువల్లోకి (డినామినేషన్) మార్చేశారు. పల్లె వెలుగు సహా అన్ని సర్వీసులకు ఈ పెంపు వర్తిస్తుంది. కొత్తగా 'సేఫ్టీ సెస్' పేరుతో ప్రతి ప్రయాణీకుడిపై ఒక్క రూపాయి చొప్పున అదనంగా చార్జీ విధించారు. గతంలో ఉన్న 'ప్రయాణీకుల మౌలికవసతుల సెస్'కు ఇది అదనం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆర్టీసీ స్థితిగతులపై చర్చ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రస్తావించలేదు. ఈనెల 15వ తేదీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియగానే గుట్టుచప్పుడు కాకుండా 16వ తేదీ ఆర్టీసీ బస్సు ప్రయాణీకుల టోల్ చార్జీలను పెంచుతూ రవాణాశాఖ చీఫ్ ఇంజినీర్ (ఐటీ అండ్ ఐఈ) ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు జాతీయ రహదారులపైనున్న టోల్గేట్లలో పెంచిన చార్జీలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సేఫ్టీ సెస్‌ను కూడా 'హేతుబద్ధీకరణ'లోకి తెస్తున్నట్టు 17వ తేదీ టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ సర్క్యులర్ విడుదల చేశారు. పల్లెవెలుగు బస్సులో 15 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.13 చార్జీ ఉండగా, దాన్ని రూ.15కి పెంచారు. అదే బస్సులో 25 కి.మీ., ప్రయాణానికి చార్జీ రూ.21 ఉంటే, దాన్ని రూ.20కి తగ్గించారు. అంటే ఒక స్టేజిలో రూపాయి తగ్గించి, మరో స్టేజీలో రెండు రూపాయల చార్జీని పెంచేశారు. సిటీ ఆర్డినరీ బస్సులో నాలుగవ స్టేజీ వరకు ఉన్న కనీస చార్జీ రూ.15ను పెంచలేదు. ఐదవ స్టేజీ నుంచి టిక్కెట్ రేటును రూ.20గా నిర్ణయించారు. అదే బస్సులో 6వ స్టేజీలో టిక్కెట్ రేటును రూ.25గా నిర్ణయించారు. 6 నుంచి 9వ స్టేజీ వరకు ఇదే ధర వర్తిస్తుంది. 10వ స్టేజీలో టిక్కెట్ ధర రూ.25 కాగా దాన్ని రూ.30 కి పెంచారు. మెట్రో డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో స్టేజీల సంఖ్యను కుదించి, పెంపును వర్తింపచేశారు. పెరిగిన చార్జీలు (హేతుబద్ధీకరణ) ఆర్టీసీలోని పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల బస్సులతో పాటు సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్‌కు కూడా వర్తిస్తాయి.2022-23 ఆర్థిక సంవత్సరంలో టీఎస్ఆర్టీసీకి బడ్జెట్లో సంస్థకు రెండుశాతం నిధులు కేటాయించాలని కార్మిక సంఘాల జేఏసీ నేతలు కోరారు. ప్రభుత్వం వారి వినతిని పరిగణనలోకి తీసుకోలేదు. పెరిగిన డీజిల్ భారాలను ప్రభుత్వం భరించాలని సూచించారు. దాన్నీ ప్రభుత్వం పట్టించుకోలేదు. డీజిల్, విడిభాగాలు సహా అన్ని రకాల ఆర్టీసీ సేవలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వసూలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. బడ్జెట్లో ఆర్టీసీకి రావల్సిన రీయింబర్స్మెంట్, ప్రభుత్వ గ్యారెంటీ రుణాల చెల్లింపులకోసం కేవలం రూ.1,500 కోట్లు మాత్రమే కేటాయించిన విషయం తెలిసిందే.
టోల్ పెంపు ఇలా...
సిటీ ఆర్డినరీ బస్సుల్లో టోల్‌ప్లాజా యూజర్ చార్జీ రూ.4 ఉండగా, దాన్ని రూ.5 కి పెంచారు. సిటీ స్పెషల్ టైప్, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం ఉన్న టోల్ చార్జీ రూ.5 ను రూ.6 కి పెంచారు. డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, గరుడ బస్సుల్లో టోల్ చార్జీ రూ.7 ఉండగా దాన్ని రూ.9కి పెంచారు. గరుడ, వెన్నెల బస్సుల్లో రూ.8 ఉండగా దాన్ని రూ.10కి పెంచారు. పుష్పక్ బస్సుల్లో టోల్ చార్జీ రూ.6 ఉండగా దాన్ని రూ.8కి పెంచారు. ఏదైనా రూట్లో 20 కిలోమీటర్ల లోపు మూడు టోల్ ప్లాజాలు ఉంటే, వాటన్నింటి చార్జీని ప్రయాణీకుల నుంచే వసూలు చేస్తారు.