Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రికెళ్లేందుకు ఆటోలు దూరని గల్లీలు
- మైనార్టీల దరిచేరని ప్రభుత్వ సంక్షేమం
- కుప్పలు తెప్పలుగా ఓల్డ్‌సిటీ సమస్యలు
- ఇంటింటి సర్వేలో వెలుగులోకి..
- వెల్లడించిన ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
నవతెలంగాణ- సిటీబ్యూరో
అసలే పేదరికం.. ఇరుకు గదులు.. దుర్భర బతుకులు.. ఎవరికైనా అనారోగ్యం వస్తే ఆస్పత్రికెళ్లేందుకు ఆటోలు కూడా దూరని చిన్న గల్లీలు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చే అరకొర ఆదాయంతో జీవనోపాధి పొందుతున్నవారు కొందరైతే.. ఉపాధిలేక పూటగడవక ఇబ్బంది పడే బతుకులు మరెన్నో హైదరాబాద్ ఓల్డ్ సిటీ గల్లీల్లో కనిపిస్తాయి. ఏండ్ల తరబడి ఇక్కడ అధికారంలో ఉంటున్న ప్రజా ప్రతినిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వంకానీ పాతబస్తీ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నది స్థానికుల ఆవేదన. తాజాగా ఆవాజ్ ఇంటింటి సర్వేలోనూ అదే అంశాలు దృష్టికొచ్చాయి. ప్రభుత్వ సంక్షేమం మైనార్టీల దరిచేరడం లేదని, వారి బతుకుల్లో పెద్ద మార్పులేవీ రాలేదని స్పష్టమైంది. ఆవాజ్ హైదరాబాద్ సౌత్ కమిటీ కార్యదర్శి షేక్ అబ్దుల్ సత్తార్, నాయకులు అఖ్తర్ బేగం, పర్వీన్ సుల్తానాలతో కూడిన బృందం శుక్రవారం యాకుత్‌పురా, గంగానగర్‌లో ముస్లింల సమస్యలు తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. సర్వేలో పాల్గొన్న ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మమహ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పాతనగరం సమస్యల సుడిగుండంలా ఉందని, ఎవరిని కదిపినా సమస్యలు, ఇబ్బందులే చెబుతున్నారని తెలిపారు. ఇక్కడి ప్రజలు ఇరుకు సందుల్లో, అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో గాలి, వెలుతురు అందక దుర్భరమైన జీవితాల్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యం పాలైన వారిని దూరంలో ఉండే ఆస్పత్రికి డోలీలో ఎత్తుకొని రావడం గురించి మనకు తెలుసు కానీ.. రాష్ట్ర రాజధాని, నగరం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ పాత బస్తీలో కూడా అత్యవసర పరిస్థితిలో వైద్యం అందని పరిస్థితి ఉందన్నారు. అనారోగ్యం పాలైన వారిని చేతులపై ఎత్తుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాతబస్తీ అభివృద్ధిని విస్మరించాయన్నారు. అందుకే తీవ్రమైన సమస్యలు సర్వే బృందం దృష్టికి వచ్చాయని చెప్పారు.
మంచినీళ్లు కూడా అందట్లే..
ఓల్డ్ సిటీలోని కొన్ని బస్తీల్లో ఇప్పటికీ మంచినీళ్ల సరఫరా సరిగా లేదని, సురక్షితమైన తాగునీరు అందక ఇబ్బంది పడుతున్నారని అబ్బాస్ వివరించారు. డ్రయినేజీ, పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. ఇంటి కిరాయిలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని, డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకున్నా రావడం లేదని గంగానగర్ ప్రజలు వాపోయారని తెలిపారు. సమస్యలను స్థానిక కార్పొరేటర్ పట్టించుకోవడం లేదన్నారు. గంగానగర్-2లో మురికి కాలువ పక్కన 13 కుటుంబాలు దుర్భరమైన స్థితిలో జీవిస్తున్నాయని అబ్బాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నివసించే వారంతా రోజు వారీ కూలీలు కావడంతో, పని దొరికితే తప్ప ఇల్లు గడవడం లేదన్నారు. తమ కష్టాలను తీర్చాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పించాలని, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా యువతకు లోన్లు ఇప్పించాలని అనేకమంది అడుగుతున్నారని చెప్పారు. పింఛన్లు మంజూరుకాని వికలాంగులు, వితంతువులూ సమస్యను వివరించారన్నారు. సమస్యల పరిష్కారానికి ఆవాజ్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని చెప్పారు. ప్రజలు అందుకు సహకరించాలని కోరారు.