Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూట్ మ్యాప్, ఏర్పాట్లపై కసరత్తు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అలుముకుంటున్నది. ఎన్నికల్లో ధనబలం, అర్ధబలాలను ప్రయోగిస్తున్నప్పటికీ..అవేవీ పని చేయవనేది తెలిసిందే. ప్రత్యక్షంగా ప్రజలను కలిసి తెలుసుకుంటనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే సోయి పార్టీల్లో వస్తున్నది. ఈ క్రమంలో ఇప్పటికే అధికార టీఆర్ఎస్ సభలూ, సమావేశాల పేరుతో హడావుడి చేస్తున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోతారనే చర్చ ఊపందుకుంది. వైఎస్ షర్మిల పాదయాత్ర, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాదయాత్ర కొనసాగుతున్నాయి. ఆమాద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కూడా తెలంగాణలో పాదయాత్ర చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ రెండోతేదీన టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పాదయాత్ర మూహుర్తం ఖరారు చేసినట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి టీఆర్ఎస్ నాయకత్వం వహించినప్పటికీ, పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోద ముద్ర వేసిన కాంగ్రెస్ పాత్ర కూడా ఉందని చెప్పేందుకు ఆ తేదీని ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో రేవంత్ పాదయాత్ర నిర్వహించేందుకు ఏఐసీసీ అనుమతి కోసం కూడా ఆయన లేఖ రాసినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో యాత్ర కొనసాగేలా కసరత్తు చేస్తున్నారు. రూట్ మ్యాప్, పాదయాత్రకు కావాల్సిన ఏర్పాట్లపై ఇప్పటికే ప్రాథమిక అవగాహనకు వచ్చినట్టు తెలిసింది.