Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులను ఒత్తిడికి గురిచేయోద్దు
- అప్రమత్తంగా ఉండండి
- కార్మికులకు టీఎస్ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) సర్వే పేరుతో కార్మికుల నుంచి బలవంతంగా సంతకాలు చేయించుకోవడాన్ని తక్షణం నిలుపుదల చేయాలని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ యాజమాన్యాన్ని కోరింది. ఏ విషయంలోనూ స్పష్టత ఇవ్వకుండా, సర్వే పేరుతో నోట్ పుస్తకాల్లో సంతకాలు పెట్టించుకోవడాన్ని జేఏసీ తప్పుపట్టింది. జేఏసీ అత్యవసర సమావేశం శనివారం ఆన్లైన్లో జరిగింది. చైర్మెన్ కే రాజిరెడ్డి, వైస్ చైర్మెన్ కే హన్మంతు, కన్వీనర్లు వీఎస్ రావు, పి కమాల్రెడ్డి, కో కన్వీనర్లు కే యాదయ్య పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న వేధింపులతో కార్మికులు సంస్థపై నమ్మకాన్ని కోల్పోతున్నారనీ, వారికి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం, యాజమాన్యం ఆ పని చేయకుండా, కార్మికుల మానసిక స్థితిని ఆసరా చేసుకొని వీఆర్ఎస్ ఇచ్చి ఇండ్లకు పంపడమంటే ఆర్టీసీని నిర్వీర్యం చేయడమనేనని వారు స్పష్టంచేశారు. ఈ పనిని తక్షణం ఆపేయాలని డిమాండ్ చేశారు. ఎవరూ అడక్కుండానే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచి, ఇప్పుడు వీఆర్ఎస్ ప్రతిపాదన తేవడాన్ని జేఏసీ నేతలు తప్పుపట్టారు. కార్మికులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తక్షణం ఆర్టీసీ కార్మికులకు రావల్సిన రెండు వేతన సవరణలు, ఆరు డిఏలు, లీవ్ ఎన్క్యాష్మెంట్, 2013 బాండ్ ఎరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు.