Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 317 జీవోతో స్థానచలనం పొందిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల జనవరిలో 25 రోజుల వేతనాలు పెండింగ్లో ఉన్నాయనీ, వాటిని వెంటనే సర్కారు జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ ఉద్యోగుల యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్, ఉపాధ్యక్షులు ఎం పవన్ కుమార్ శనివారం ప్రకటన విడుదల చేశారు. స్థానంచలనం పొందిన వారిలో అత్యధిక శాతం సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులేనని గుర్తు చేశారు. దాంతోపాటు, గత ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మెడికల్ సెలవుల వేతనం, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు ఇవ్వాలని కోరారు. ఈనెల 31వ తేదీతో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున పెండింగ్ బిల్లులు తిరస్కరణకు గురయ్యే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.