Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల కోసం పోరాటం
- ఈనెల 21న దేశవ్యాప్త నిరసన
- ఏప్రిల్ 11 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు :
- అఖిల కిసాన్‌సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ - వనపర్తి
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల కిసాన్‌సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మినీ ఫంక్షన్ హాలులో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జీఎస్ గోపి అధ్యక్షతన శనివారం నిర్వహించిన సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. లఖింపూర్ ఖేరీ కేసులో పోలీసు యంత్రాంగం, న్యాయవాదులు కలిసి నిందితులను రక్షించి.. అమాయక రైతులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి తీవ్రమైన నేరం కేసులో కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడికి ఇంత త్వరగా బెయిల్ రావడం ఆశ్చర్యం కలిగించే అంశమన్నారు. ఆశిష్ మిశ్రా విడుదలైన తర్వాత.. కేసులో కీలక సాక్షిపై దాడి చేయడం ఆందోళన కలిగించే విషయమన్నారు. గతేడాది డిసెంబర్ 9న సంయుక్త కిసాన్ మోర్చాకు కేంద్ర ప్రభుత్వం రాతపూర్వక హామీలను ఇచ్చిందన్నారు. మూడు నెలల తర్వాత కూడా ప్రభుత్వం తన కీలక హామీలపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఎంఎస్పీపై కమిటీ వేస్తామన్న హామీ ఎక్కడా కన్పించలేదన్నారు. దేశవ్యాప్తంగా రైల్‌రోకో సందర్భంగా నమోదైన కేసులు నేటికీ తొలగించలేదన్నారు. లఖింపూర్ ఘటనలో ప్రభుత్వ పాత్రపై, రైతుల ఉద్యమానికి ఇచ్చిన హామీల విస్మరణపై ఈ నెల 21న దేశవ్యాప్త నిరసన కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. అదే క్రమంలో ఈ నెల 28, 29 తేదీల్లో చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. పంటలకు కనీస మద్దతు ధర ప్రకటన చేయాలని కోరుతూ ఏప్రిల్ 11 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రకటించారు. రైతులు సంఘటితమై రైతు ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎండీ.జబ్బార్, జిల్లా కార్యదర్శి బాల్‌రెడ్డి, ఉపాధ్యక్షులు పరమేశ్వర ఆచారి, మహబూబ్ భాష, సహాయ కార్యదర్శులు వెంకటేష్, భాస్కర్ పాల్గొన్నారు.