Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మల్లు స్వరాజ్యం...అతి చిన్న వయసులోనే దేశం కోసం పోరాడారు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా తుపాకి పట్టారు. స్వతంత్ర భారతదేశానికి డెభ్బై ఏండ్లు గడిచిన సందర్భంగా ఆ వీరనారి అనుభవాలు ...
ఉప్పుసత్యాగ్రహం జరుగుతున్న కాలంలో నేను పుట్టాను.మా మేనత్త కొడకు ఆ ఉద్యమంలో పాల్గొని వచ్చి అక్కడ జరిగిన స్వరాజ్ ఉద్యమం గురించి మా అమ్మకు చెప్పాడు. దాంతో మా అమ్మ ఆడపిల్లలు స్వేచ్ఛగా చదువుకోవాలి, స్వేచ్ఛగా బతకాలి అని కోరుకుంది. అందుకే నాకు స్వరాజ్యం అనిపేరుపెట్టింది. ముఖ్యంగా ఆనాడు స్త్రీలను పరదాల చాటున ఉంచుతున్నారనే ఉద్దేశంతో స్త్రీలకు స్వేచ్ఛకావాలని కోరుకుంది.
సంస్కరణోద్యమాల ప్రభావంతో...
మార్క్సిజం, మాక్సిమ్ గోర్కి ''అమ్మ'' నవల చదివి 13 ఏండ్ల వయసులో ఉద్యమంలోకి వచ్చాను. అప్పట్లో స్త్రీలకు స్వేచ్ఛలేదు, చదువులేదు. అందుకే మహిళలకు చదువు కావాలి, అభివృద్ధి కావాలని కోరుకున్నాను. బాల్యవివాహాలను వ్యతిరేకించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. తర్వాత దీన్నే కమ్యూనిస్టులు వారసత్వాన్ని ఎత్తుకున్నారు. అలాగే అప్పట్లో సోవియట్ రష్యా ప్రభావం కూడా మాపై పడింది. దీని ఫలితంగానే నాలాంటి ఎందరో మహిళలు ఉద్యమాల్లోకి వచ్చారు. ఉదాహరణకు సూర్యావతి, కాటూరి రాజేశ్వరమ్మ, సూర్యదేవర రాజ్యలక్ష్మి, వాసిరెడ్డి సీతాదేవి వీళ్ళంతా స్వాతంత్య్రం కోసం పోరాడారు.
నాటి నుంచి నేటి వరకు
ఆనాటి వివాహ వ్యవస్థకు, స్త్రీలను నాలుగ్గోడల మధ్య ఉంచడానికి వ్యతిరేకంగా, స్త్రీలకు స్వేచ్ఛ కావాలని గాంధీ ఇచ్చిన పిలుపును అందుకొని మహిళలు జైళ్ళకు వెళ్ళారు. ఆనాటి మహిళలు ప్రదర్శించిన ధైర్య సాహసాల ఫలితంగానే ఏ దేశంలో స్త్రీలకు ఓటు హక్కు రాకముందే మన దగ్గర వచ్చింది. సాయుధ తెలంగాణ పోరాటంలో మగవాళ్ళను పట్టుకెళితే స్త్రీలే భూమిని దున్ని పండించారు. అలాంటి మహిళల గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి స్త్రీలను పక్కన పెడితే పోరాటమే లేదు. స్త్రీలను కాదంటే ఉద్యమమే లేదు. ఐలమ్మ భూ పోరాటమే దీనికి నిదర్శనం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటు వేసే హక్కు మాత్రమే స్త్రీలకు మిగిలింది. అసలైన స్వేచ్ఛ కోసం తన్నులాడతానే ఉన్నాం. 70 ఏండ్ల స్వాతంత్య్ర ఫలితాలు స్త్రీలకు సంపూర్ణంగా దక్కలేదన్నది నిజం.
స్త్రీలకు స్వేచ్ఛ రాకుంటే...
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అరాచకపు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. స్త్రీలు కోరుకున్న సమాజం రాలేదు. అది రావాలంటే మహిళలు ఒంటరిగా కాదు, అందరినీ కలుపుకొని పోరాడాలి. అప్పట్లో మహిళలను రాజకీయాల్లోకి తెచ్చింది కమ్యూనిస్టులు. మహిళలను ఎన్నికల్లో పోటీ చేయించింది కమ్యూనిస్టులే. నేనూ అలా వచ్చిన దాన్నే. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగంలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరినా పాలకులు మహిళలకు దక్కాల్సిన హక్కులను దక్కనీయ లేదు.లాభాల కోసం పాకులాడే ఈపెట్టుబడి దారీ వ్యవస్థను రూపుమాపకుండా మహిళలకు స్వేచ్ఛ రాదన్నది నిజం. నా ఉద్దేశంలో స్త్రీలకు, దళితులకు స్వేచ్ఛరాకుండా దేశానికి స్వతంత్రం రానట్టే.
సామూహికంగా పోరాడాలి
ప్రస్తుతం అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. మహిళలు చేయని పనంటూ లేదు. అయితే కొందరు కేవలం సొంత లాభం, సొంత కెరీర్ అంతా తమ సొంతం కోసమే ఆలోచిస్తున్నారు. ఇతరుల గురించి, సమాజం గురించి ఆలోచించ లేకపోతున్నారు. ఈ వ్యవస్థ కూడా వారిని అలాగే తయారు చేస్తుంది. అయితే మహిళలు సమాజం గురించి ఆలోచించకుండా, రాజకీయాల్లోకి, పాలనలోకి దూరకుండా స్వేచ్ఛ లభించదు. దేశంలో ఉన్న ఇంత మంది జనంలో 30 శాతం మంది ఇలా సమాజం కోసం ఆలోచించినా మార్పు కచ్చితంగా వస్తుంది. ఇది నా అనుభవంతో చెబుతున్న మాట. ఆనాడు వీరతెలంగాణ పోరాటంలో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాడి నిరూపించాం. కొంతమంది పోరాటాలు చేస్తున్నారు. వ్యక్తిగత పోరాటాల వల్ల సమాజం మారదు. సమాజంలో సగభాగమైన స్త్రీలు సాధికారతను సాధించాలంటే వ్యక్తిగతంగా కాదు సామూహికంగా పోరాడాలి. భద్రతను ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లకు చదువు, పెళ్ళి విషయంలో నిర్ణయం తీసుకున్న హక్కు రావాలి. ఇది సాధించాలంటే రాజకీయ, ఆర్థిక పోరాటాలే శరణ్యం.