Authorization
Mon Jan 19, 2015 06:51 pm
('నా మాటే తుపాకి తూటా' పుస్తకం నుంచి మల్లు స్వరాజ్యం మాటలు)
తెలంగాణాలో, నాకన్నా గొప్ప పేరు సంపాదించినామె రాములమ్మ పోరాటంలో శత్రువును హడలగొట్టిందామె. సంసారంలో జొరబడితే చాలా మందికి మన ధ్యాసే లేకుంట బోయింది. మరి నేను సంసారం జేసిన. సంఘం జేసిన. నా ప్రత్యేకత అదేనేమో. నేను ఇంట్లో ఉండుకుంట గూడ అన్ని తిప్పలు బడుతూ కూడా మా ఊరి జనాన్ని నడిపించిన. ఊరేంది. ఆ చుట్టు పక్కల సూర్యాపేట సమితికి ఉపాధ్యాక్షురాలిగా నేను. వీఎన్ గారిని సర్పంచ్‌గా పెడతమంటే 'నాకు పదవులు అక్కరలేదు' అని వదిలిపెట్టాడాయన. ప్రజలమీద ఒక ప్రభావం ఉండాలె అని నన్ను బెట్టిన్రు. అప్పుడు గూడా పోరాటాలే జేసినం. ఒకసారి ఎరువులు బ్లాక్‌లో అమ్ముతుంటే,మార్కెట్కుబోయినం. నేను గూడ వడ్లు బోసుకొని, రైతుల్ని తోల్కపోయి మార్కెట్ కొచ్చినం. సూర్యాపేట, ఆ చుట్టు పక్కల రైతుల్ని సమీకరించి,ఊరేగింపుదీసీ, నినాదాలిచ్చుకుంట, షాపులెంబడి షాపులల్ల జొరబడి బస్తాలు లాక్చొచ్చి, ఇవతల పడేసినం. ఎంత తిరుగుబాటది! ఆరోజులల్ల పేపర్లల పెద్దగా బడ్డదిది.
ఒక కథ చెప్పాలి. నేను ఎమ్మెల్యేగా గెల్చినంక, ఏపది పదిహేను రోజులకో ప్రమాణ స్వీకారం అన్నరు. నేనేమో ఓట్లయిపోయినంక ఇరవయి రోజుల నియోజకవర్గంల అడీడ తిరుక్కుంట బోతున్న. జనం ఊరుకోరుగద. మా ఊరికిరా. అంటే మా ఊరికిరా అని అంటే దండలేసుకుంట తిరుగుతున్న. మల్ల మొత్తంగ నేను పోరాటాల్లోనే ఉన్నట్లనిపించింది. పిల్లలు పండుగ సెలవులకి ఇంటికని వచ్చి, గోడలు బట్టుకొని ఏడ్చుడు మొదలుపెట్టిన్రు. ఊర్లో జనం మా ఇంటికి రాండి అని తీస్కపోయి వాళ్లకి అన్నాలు పెడుతున్నరు.
ఎమ్మెల్యేగా అయి మొదట అసెంబ్లీకి వచ్చినప్పుడు,చప్రాసీ నన్నులోనికి పొనిస్తలేడు. 'న్‌లకి ఎమ్మెల్యేగా గెల్చినోల్లే పోతరు' అనుకుంట. నన్నులోనికి పోనీకుండా ఆపేసిండు బంట్రోతు. 'మరినేను ఎమ్మెల్యేనే కదా' అని అనరావడం లేదు నాకు. అది నాకు ఎక్కలేదు. అదీ ఒక ఉద్యమంలాగా చేసివచ్చిన అంతే.గెల్చిన అనంగనే, మా అన్నయ్య ఎత్తుకున్నడు. దండవేసిన్రు.అదంతా చేసిన్రుగానీ, నాకు తెల్వలే. మా అన్నయ్య అంతకు ముందుకు రెండు సార్లు గెల్చిండుగానీ, నేను ఎన్నడూ గ్యాలరీదా గుడరాలే. చూడలె. నాకు తీరలే. నేను ఎవుసాయం మీదనే వున్నా. ఘర్షణలెక్కడ వుంటే, అక్కడ బీఎన్ గావాలె, కుశలవరెడ్డి గావాలె, వాళ్లు గూడా,ఎన్నడూ నన్ను తీసుకొచ్చింది లేదు. సరే నేను పోదామంటే నన్ను లోనికి పోనిస్తలేరు. ఈ ఓంకారేంజేసిండంటే, లోపటికి పొంగనేఎవరో పల్కరించి మాట్లాడుతున్నరు అతనితో. అట్ల మాట్లాడకుంటు. మాట్లాడుకుంట అతను సంతకం పెట్టడానికి లోనివెళ్లి పోయిండు. నన్నేమో చఫ్రాసి పోనియ్యటంలేదు. ఎందుకు బోనియరు?అది అసెంబ్లీగాదా; అని అంటున్న 'ఇది అసెంబ్లేగానీ గెలిచినోళ్లే రావాలి ఇందులకు అంటున్నడు. అంతలో నేను చిన్నగ నేను గెల్చినగద' అన్న ఆయనకి అర్థంగావడం లేదు. నువ్వెట్ల గెల్చినవ్. నువ్వు గెల్చుడేంది' అంటున్నడు బంట్రోతు (నవ్వు) నేను జూస్తే ఎమ్మెల్యే పోజిషన్లో లేను. మరి కనీసం ఇస్త్రీ చీర,కొత్త చీర కాకుంటే మయె , అదిగూడ లేదు. ఓంకార్ సంతకం పెట్టిండు, వచ్చిండు.ఆయనకి సంతకం బెడుతన్నప్పుడన్నా. కనీసం నేను లేనుగద అన్న ధ్యాసైనా లేదు. బయటకొచ్చి నన్ను చూసి, ఓV్‌ా ఏమనుకున్నవ్ ఆమెను. ఆమె మా నాయకురాలు. గెల్చివచ్చింది. ఏమనుకున్నవ్ అని, నన్ను తీసుకొని లోపలికి పోయిండు. ఇప్పుడు సంతకం బెట్టిన. నాకు ఇంగ్లీషురాదు. ఎజెండా కూడా ఇంగ్లీషుల్లో ఇస్తున్నరు. కొంచెం భయమైంది. మొదటిరోజు. నాకు క్వాటర్ లేదప్పుడు. అప్పుడుసుగుణ ఎర్రమంజిల్ కాలనీలో ఉండేది. ఆడినుంచి సుగుణను కలుసుకోడానికి పోయిన.
ఆ అమ్మ ఈ మోపునొచ్చినావే. ఎమ్మెల్యేవి ఈమోపునొచ్చినవ అంటున్నది. ఈమోపేంది? ఏమైంది? పన్నెండు రూపాయలచీరె. ఈ మధ్య కంట్రోలు చీరెలని వచ్చినవి. అయి నేను కట్టిన, మొద్దు చీరలే కట్టేది. వ్యవసాయానికి పనికొస్తయినగద అవి.సుగుణ బీరువా నుండి, ఒక బెంగాల్ కాటన్ చీర, అవ్వీ, ఇవ్వీ తీసి ఇచ్చింది. తల కడుక్కోమంటే, తలకబోసుకోని తెల్లారి టిప్పుటావుగ బోయిన అసెంబ్లీకి.
ప్రముఖ రచయిత్రుల మాటల్లో....
మల్లు స్వరాజ్యం సాహస యోధురాలు...ఝాన్సీరాణి ...: వసంత కన్నబిరాన్
స్వాతంత్రోద్యమం యువతను ఉర్రూతలూగిస్తున్న కాలానికి చెందిన మల్లు స్వరాజ్యం గొప్ప సాహస యోధురాలు. ఆమె ఒక లెజెండ్,ఒక హీరో, ఆ కాలంలో గుర్రం మీద ప్రయాణం చేసే ఆమెను చూసి జనం అభిమానంతో ఝాన్సీ రాణి అని పిలుచుకునేవారు. మొదట స్వాతంత్య్రోద్యమంలోనూ ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలోనూ చాలా చురుకుగా పాల్గొన్నారు. నిర్మొహమాటానికి, ధైర్యానికి పెట్టింది పేరు. ఆమె అంటే సహచరులకే కాదు, నాయకులకు కూడా అభిమానమూ, భయమూ రెండూ వుండేవి. అరమరికలు లేకుండా అందరితో కలిసిపోయే మనస్థత్వం వల్ల ఇతర నాయకులంటే ఆమె ఎంతో భిన్నంగా కనిపించేవారు. అటు స్వాతంత్య్రోద్యమంలో, ఇటు సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొంటూ ఆమె తన అనుభవాలను వివరిస్తుంటే వినడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆమె మాటతీరు, వ్యవహార శైలి మూస పద్దతికి భిన్నంగా, చాలా విలక్షణంగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు శతాబ్దానికి ఏ ఒక్కరో ఉంటారు. మల్లు స్వరాజ్యం రెండు శతాబ్దాలను ప్రభావితం చేసిన మహా యోధురాలు.
మల్లు స్వరాజ్యం జీవితమంటే... తెలంగాణ సామాజిక, రాజకీయ చరిత్ర : - ఓల్గా
మల్లు స్వరాజ్యం గారి జీవితమంటే 20వ శతాబ్దపు తెలంగాణ సామాజిక రాజకీయ చరిత్ర. అణచివేతను సహించలేని ప్రజల సామూహిక తిరుగుబాటు చరిత్ర.పీడితుల పట్ల సహానుభూతితో పిడికిలి బిగించి పోరాడిన ఒక తరం చరిత్ర. వ్యక్తి శక్తిగా మారే క్రమాన్ని చూపే చరిత్ర. రాజకీయాల్లోకి మహిళలు రావటమంటే మల్లు స్వరాజ్యం గారిలా రావాలి. అధికారం, పెత్తనం,అనేకానేక స్వీయ ప్రయోజనాలను ఆశించి రాజకీయాలలోకి వచ్చిన నాయకురాళ్లకు ఆమె రాజకీయ జీవితం. పూర్తి భిన్నం మన జీవితాలకు సంబంధించిన నిర్ణయాధికారాన్ని మన చేతుల్లోకి తీసుకోవటమెలాగో నేర్పే గొప్ప పాఠం ఆమె తొలినాళ్ల జీవితం.