Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వరాజ్యం మరణం బాధాకరం : పుణ్యవతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బంధువుల పొలాల్లోని వ్యవసాయ కూలీలనే ఏకం చేసి పెత్తందారులకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన ధీశాలి మల్లు స్వరాజ్యం అని ఐద్వా నేత పుణ్యవతి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 'అన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి స్ఫూర్తితో పన్నెండేండ్ల వయస్సులోనే మల్లు స్వరాజ్యం ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ఆమెతో కలిసి ఐద్వాలో పదేండ్లు పనిచేశా. స్వరాజ్యం ఏది మాట్లాడినా స్ఫూర్తివంతంగా ఉంటుంది. బంధువుల పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలను ఏకం చేసి హక్కుల కోసం చిన్న వయస్సులోనే ఉద్యమించారు. ఆరోజుల్లో దయనీయంగా ఉన్న వ్యవసాయ మహిళా కార్మికుల్లో పాటలతో స్ఫూర్తి రగిలించి దొరల అహంకారం, అణిచివేతపై పిడికిలి బిగించింది స్వరాజ్యం. 12 ఏండ్ల వయస్సులోనే విజయవాడలో జరిగిన సీపీఐ(ఎం) పార్టీ శిక్షణా తరగతులకు హాజరయ్యారు. ప్రజలతో మమేకమై ఉద్యమం చేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా. ఆ అనుభవం పార్టీ నిర్మాణంలో ఎంతో దోహదపడింది. 1980 నుంచి ఐద్వాకు సుదీర్ఘకాలం సేవలందించారు. ఎమ్మెల్యేగా గెలిచిన సాదాసీదాగానే ఉండేవారు. మద్యపాన నిషేద ఉద్యమంలో చురుకుగా పాల్గొని నెల్లూరులో భారీ సభ నిర్వహించారు. స్త్రీలకు సమాన ఆస్తిహక్కు కోసం అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం నియమించిన కమిటీలో సభ్యులుగా ఉండి రాష్ట్రమంతా పర్యటించారు. మహిళలకు మరుగుదొడ్లు కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. హైదరాబాద్లో జరిగిన రమీజాబి, షకీలా లైంగికదాడుల ఘటనలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఒక్క మాటలో చెప్పాలంటే పోరాటాలకు చిహ్నం మల్లు స్వరాజ్యం.' అని ఐద్వా నేత పుణ్యవతి పేర్కొన్నారు.