Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి కూలీలకు గిట్టని కూలి
- ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌తో భృతి ఎత్తివేత
- ఎండలు ముదిరి.. గట్టి బారిన నేలలు
- చేతులు బొబ్బలొచ్చేలా పనిచేసినా రూ.150 దాటని కూలి
- వేసవి భత్యం ఇవ్వాలని కూలీల డిమాండ్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
'ఎండలు భగ్గుమంటున్నాయి.. మట్టి పని చేయడం కష్టంగా ఉంది. పొద్దంతా కష్టపడినా కూలి గిట్టడం లేదు. మా ఊరులో వరద కట్టల పని పెట్టిండ్రు.. నాలుగు వారాల నుంచి చేస్తున్నాం. ఎండలకు నేలలు గట్టిబారి రోజంతా తొవ్వినా గజం జరుగుతలేదు. చేతులు బొబ్బలు వస్తున్నాయి. గతంలో ప్రభుత్వం ఎండాకాలం భత్యం ఇచ్చేది. ఈ ఏడాది ఇప్పటికీ బోనస్ ఇవ్వడం లేదు. కొత్త సిస్టమ్ వచ్చింది. ఇక బోనస్ రాదంటుండ్రు.. ఎండాకాలం మొత్తం ఎంత కష్టం చేసినా కూలి రూ.100 దాటేట్టు లేదు. బతికేదెట్టో అర్థం కావడం లేదు' అని దండుమైలారం గ్రామానికి చెందిన ఉపాధి కార్మికురాలు నిర్మల 'నవ తెలంగాణ'తో తమ గోడు వెళ్లబోసుకుంది. ఇది ఒక నిర్మల ఆవేదనే కాదు జిల్లాలోని ప్రతి కూలీని పలకరించినా ఇదే బాధను చెబుతున్నారు.
రంగారెడ్డి జిలాల్లో లక్ష 65వేల 352 జాబ్ కార్డులు ఉన్నాయి. 2లక్షల 90వేల 298 మంది కార్మికులు ఉన్నారు. ఇందులో ఈ ఏడాది ఉపాధి పనులకు వెళ్లిన వారు లక్షా 30వేల 294 మంది. జిల్లాలో వ్యవసాయ పనులు లేని సమయంలో రోజు కూలీకి వెళ్లే వారి సంఖ్య లక్షకు పైమాటే. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఈ సంఖ్య పెరుగుతుంది. ఈ సమయంలో ప్రభుత్వం ఇవాల్సిన బోనస్ ఇవ్వకపోవడంతో కూలీలు ఈ ఏడాది సుమారు రూ.100 కోట్లు నష్టపోనున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గతంలో కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలీల ఖాతాల్లో జమా చేసేది. కానీ ప్రస్తుతం ఉపాధి కూలీల డబ్బుల బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడంతో కూలీలకు కష్టాలు మొదలయ్యాయి. వేసవిలో భూమి బాగా గట్టిపడి పనులు చేసేందుకు అనువుగా ఉండదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూలీలు ఎక్కువ సమయం పని చేయడం సాధ్యం కాదు. వేసవిలో పని చేసేందుకు కూలీలు ఆసక్తి చూపే వారు కాదు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీలకు ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలలో 30 శాతం, జూన్ నెలలో 20 శాతం వేసవి భృతి ఇచ్చేది. దీంతో ఉపాధి కూలీలకు కూలితోపాటు అదనంగా రోజుకు రూ.40 నుంచి రూ.60 వచ్చేవి. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తూ చెల్లింపులు నేరుగా చేస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌లో వేసవి భృతి కల్పించేందుకు ఆప్షన్ లేదు. దీంతో వేసవిలో పని చేసినా పూర్తిస్థాయిలో డబ్బులు వచ్చే పరిస్థితి ఉండదని కూలీలు ఆవేదన చెందుతున్నారు.
పనిదినాలు తగ్గింపు..
ఉపాధి హామీలో ప్రతి కూలీకి 100 రోజుల పని కల్పించాలి. గతంలోని సాఫ్ట్వేర్ కనీస వేతనం ఒక్క పని దినంగా లెక్క వేసేది. దీని వల్ల ఒక రోజు వేతనం తగ్గినా మరుసటి రోజు పని చేసుకునే అవకాశం ఉండేది. కొత్తగా వచ్చిన ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌లో ఉపాధి కూలీ పనికి వచ్చిన రోజును మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. దీంతో రోజులో కనీస వేతనం రాకపోయినా పని దినం పూర్తయినట్లే. దీంతో ఉపాధి కూలీ 100 రోజులకు మించి పని చేసే అవకాశం లేదు. ప్రభుత్వం స్పందించి వేసవి భృతి, ఇతర అలవెన్స్‌లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.
వేసవి అలవెన్స్‌లు ఇవ్వాలి
ఉపాధి కూలీలకు ప్రతి ఏడాదీ ఎండాకాలం ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఇచ్చే అలవెన్స్‌లను ఇవ్వాలి. కొత్త సాఫ్ట్‌వేర్‌తో పని రోజులు తగ్గే అవకాశం ఉంది. తక్షణమే సాఫ్ట్వేరుల్లో ఉన్న సాంకేతిక లోపాలను సవరించాలి. ప్రతి కూలీకి 100 రోజులు పని దినాలు కల్పించాలి
- పి.జగన్- వ్యవసాయ కార్మిక సంఘం, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి.