Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మల్లు స్వరాజ్యం మృతికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు సంతాపం తెలిపారు. తాను విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన దగ్గర నుంచి ఆమె పోరాట స్పూర్తి మమ్మల్ని ఎంతగానో ఉత్సాహపర్చేదని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మల్లు స్వరాజ్యం విప్లవనారి : తమ్మినేని వీరభద్రం
మల్లు స్వరాజ్యం మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. పసితనంలోనే కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి చివరి శ్వాస వరకు పార్టీలో, ప్రజా పోరాటాల్లో కొనసాగిన విప్లవనారి అని కొనియాడారు. పిల్లలను వదిలేసి ఆయుధాలు చేతబట్టుకుని నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన గొప్పవీరనారి అని గుర్తుచేశారు. తమ పార్టీలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కమిటీ స్థాయి వరకు ఎదిగిన మొదటి మహిళ అని పేర్కొన్నారు. మహిళా ఉద్యమ నిర్మాణంలో, భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో ఆమె ముందుండి ఉద్యమాన్ని నిర్మించారని గుర్తుచేశారు. మరణానంతరం కూడా విద్యార్థుల పరిశోధన నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తన మృతదేహాన్ని ఇవ్వాలని చెప్పిన గొప్ప మనిషి స్వరాజ్యం అని తెలిపారు.
స్వరాజ్యం మరణం పేదలకు తీరని లోటు : రేవంత్‌రెడ్డి
తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా పేదల పక్షాన పోరాటం చేసిన చైతన్య దీపిక మల్లు స్వరాజ్యం అనీ, ఆమె మరణం పేదలకు తీరని లోటు అని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేర్ ఆస్పత్రిలో మల్లుస్వరాజ్యం పార్ధీవదేహాన్ని సందర్శించారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. స్వరాజ్యం మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
తుపాకి పట్టి భూస్వాములను ఎదిరించిన ధీశాలి : సురవరం, చాడ వెంకట్‌రెడ్డి
సాయుధ పోరాటంలో తుపాకి పట్టి భూస్వాములను ఎదిరించిన ధీశాలి మల్లు స్వరాజ్యం అనీ, ఆమె మరణం వామపక్షపార్టీలకు తీరని లోటు అని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మల్లు స్వరాజ్యం మృతికి విప్లవ జోహార్లు : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మరణం పట్ల ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విప్లవజోహార్లు అర్పించారు. ఆమె మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ధీరోదాత్త వనిత : పాటూరు రామయ్య, సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే
మల్లుస్వరాజ్యం గొప్ప పోరాటయోధురాలనీ, తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ధీరోదాత్త వనిత అని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య పేర్కొన్నారు.మహిళా ఉద్యమాల్లో మార్గదర్శకంగా ఉన్నారని తెలిపారు.శాసనసభలోనూ తన ప్రతిభను చాటార ని గుర్తుచేశారు.చాలా కాలం ఆమెతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆమె విశిష్టమైన కమ్యూని స్టు, ఈ సందర్భంలో అనేక జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని తెలిపారు. ఆమెకు నివాళులు అర్పిస్తున్నాననీ, కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నానని తెలిపారు.
సిద్ధాంతాలు వేరైనా..పేదల పక్షాన ఆమె పోరాటాలు చిరస్మరణీయం : బండి సంజయ్
తమ సిద్ధాంతం వేరైనా..పేదల పక్షాన మల్లు స్వరాజ్యం చేసిన పోరాటాలు చిరస్మరణీయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు తమ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు.
చివరి వరకూ నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డ వ్యక్తి స్వరాజ్యం : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
చివరి వరకూ నమ్మిన సిద్ధాంతం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప వ్యక్తి మల్లు స్వరాజ్యం అనీ, ఆమె మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సంతాపాలు
రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వర్రావు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తదితరులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రజా, ఉద్యోగ సంఘాల నివాళి
తెలంగాణ సాయుధ పోరాట యోధులు మల్లు స్వరాజ్యం మృతికి ప్రజాసంఘాలు నివాళి అర్పించాయి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపాయి. సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, ఎం.సాయిబాబు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌రావు, టి.సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకట్రాములు, కేంద్ర కమిటీ సభ్యులు బి.ప్రసాద్, మహిలా కూలీల రాష్ట్ర కన్వీనర్ బి.పద్మ, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి బివి విజయలక్ష్మి, ఐద్వా సీనియర్ నేత హైమావతి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి.బసవపున్నయ్య, తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభాపురం జనార్ధన, కె.ఆనందాచారి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రమణ, మైసశ్రీనివాసులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వామపక్ష నాయకుల నివాళి
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవీ రమణ, సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు వి.ఉమామహేశ్వర్రావు, ఐద్వానేత అరుణ, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ, సహాయ కార్యదర్శి పోటు రంగారావు, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి తదితరులు మల్లు స్వరాజ్యం మృతికి సంతాపం తెలిపారు.
నవతెలంగాణ కుటుంబం నివాళి
మల్లు స్వరాజ్యం మృతికి నవతెలంగాణ కుటుంబం శ్రద్దాంజలి ఘటించింది. నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్ ఆర్ సుధాభాస్కర్, సీజీఎమ్ ప్రభాకర్, ఎడిటోరియల్ బోర్డు మెంబర్స్, జనరల్ మేనేజర్లు, నవతెలంగాణ కుటుంబం సంతాపం ప్రకటించింది.