Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలూరి గౌరీశంకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత గోరటి వెంకన్న నోబుల్ పురస్కారం రావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ ఆకాంక్షించారు. శనివారం తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గోరటి వెంకన్నతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత తగుళ్ల గోపాల్ అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా వారివురిని అతిథులు శాలువ, మెమెంటోతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జూలూరీ గౌరీశంకర్ మాట్లాడుతూ అస్థత్వ సాహిత్యం వెంకన్న ప్రత్యేకత అని తెలిపారు. తనకు తాను తన్మయత్వం చెందేవాడు, స్వరంలో మహాకావ్యాలను ఉంచుకున్నవాడు, కంఠంలో తెలుగు సాహిత్యాన్ని నిక్షిప్తం చేసుకున్నవాడు, ఈ కాలపు వేమన, పోతులూరి వీరబ్రహ్మం, ప్రవక్త అని కొనియాడారు. యేసుక్రీస్తు, పోతులూరి వీరబ్రహ్మం కూడా గొర్రెల కాపరులని గుర్తుచేశారు.
ప్రముఖ కవి, విమర్శకులు ఆర్.సీతారాం మాట్లాడుతూ గోపాల్ కవిత్వం విశిష్టత, విలక్షణతో కూడుకున్నదని తెలిపారు. ఆయన కవిత్వంలో దారిద్య్రం, పేదరికం, దుర్భిక్షం కనిపిస్తాయని చెప్పారు. గోరటి వెంకన్న సమాజానికి ప్రత్యామ్నాయ సాహిత్య సంపదను కానుకగా ఇచ్చారని తెలిపారు. ప్రముఖ కవి యాకూబ్ మాట్లాడుతూ గుర్తుండే సాహిత్యాన్ని సహజత్వానికి దగ్గర సజనాత్మకంగా అందిస్తున్న కవులు గోరటి, గోపాల్ అని ప్రశంసించారు. నవతెలంగాణ సంపాదకులు ఆర్.సుధాభాస్కర్ మాట్లాడుతూ కన్నీళ్ల నుంచి వచ్చే కవిత్వానికి అద్భుతమైన శక్తి ఉంటుందని తెలిపారు. గోపాల్, గోరటి సాహిత్యం జనం జీవితాన్ని అర్థం చేసుకునేందుకు, స్థానిక ప్రజల కష్టాలు అందులో ఉన్నాయని చెప్పారు. ఇలాంటి సాహిత్యాన్ని మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
మార్క్సిజానికి రుణపడి ఉన్నా....గోరటి
తనను నిలబెట్టింది మార్క్సిజమేనంటూ దానికి రుణపడి ఉన్నానని గోరటి వెంకన్న స్పందించారు. మార్క్సిజానికి ఎన్ని రకాల ఓటమి ఎదురైనా గెలుపులో పయనిస్తుందని తెలిపారు. బతకాలనీ,మార్క్సిజాన్ని అంగీకరించాలని సూచించారు.తన భాష లో రాసే తెలివిని ప్రజా,విప్లవోద్యమమే ఇచ్చిందన్నారు. తమను నిలెబెట్టడంలో అరసం నుంచి విరసం వరకు పాత్ర ఉందన్నారు. మార్క్సిజం,అనంతరం విప్లవవాదం వల్ల తనకు పాత సంప్రదా యాన్ని ధిక్కరించే ధైర్యమొచ్చిందని తెలిపారు. ఉద్యమంలో ఉంటేనే మంచి కవిత్వం వస్తుందనిఅభిప్రాయపడ్డారు.మార్క్సిజం తనకు నేర్పిన జ్ఞానం, పదే పదే దానిని ఆరాధించడం కవిగా నిలబెట్టాయన్నారు. మార్క్సిజం దృక్పథం కవులకు వస్తే సమాజం పరుగులు పెడుతుందని అభిప్రాయపడ్డారు.
తగినంత స్వేచ్చనిచ్చాకే ...ఎమ్మెల్సీగా
దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరముందని గోరటి అన్నారు. కేసీఆర్ పిలిచి ఎమ్మెల్సీగా ఇచ్చే ముందు అన్ని విషయాలు చర్చించారని చెప్పారు. తన గురించి తెలిసిన కేసీఆర్ తగినంత స్వేచ్ఛనిచ్చాకే ఎమ్మెల్సీ అయ్యానని స్పష్టం చేశారు. ఎల్లప్పుడు కవిగా ఉంటానని తెలిపారు.
అందరికి శనార్థులు...గోపాల్
తగుళ్ల గోపాల్ మాట్లాడుతూ తనకు సహకరించిన అందరికి పేరు పేరున శనార్థులు తెలిపారు. కవిత్వంలో తండ్రిలా యాకూబ్, తెలంగాణ సాహిత్యానికి పరిచయం చేసిన సలీమా తదితరులు అందించిన సహకరం మరువలేనిదని తెలిపారు. కవిసంగమం తనకు ధైర్యాన్నిచ్చిందన్నారు. గోరటి వెంకన్న పక్కన కూర్చోవడమే పెద్ద అవార్డు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తాను రాసిన పలు కవితలను చదివి వినిపించారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితి ఉపాధ్యక్షులు స్ఫూర్తి, మోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.