Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందల లారీలతో హైదరాబాదుకు రవాణా
- భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతుల ఆందోళన
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
సహజ వనరులు అందుబాటులో ఉన్నా స్థానికులు ఉపయోగించుకునే పరిస్థితి ఉండటం లేదు. బయటి వారు తన్నుకుపోతున్నారు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మోత్కూరు, గుండాల అడ్డగూడూరు మండలాల పరిధిలో ఇసుక ఉన్నా.. ఆ మండల ప్రజలు వాడుకునేందుకు అధికారులు అవకాశం ఇవ్వడంలేదు.. చుట్టూ బిక్కేరు వాగు ఉన్నా.. ఇండ్ల నిర్మాణాలకు, గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఇసుక లభించక ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇంటి నిర్మాణానికో, ఏదైనా అభివృద్ధి పనికో ట్రాక్టర్ ఇసుక కావాలంటే హైకోర్టు స్టే అంటూ నిబంధనలు చెబుతున్న అధికారులు.. బిక్కేరు వాగు నుంచి రోజూ వందల లారీలతో రేయింబవళ్లు హైదరాబాదుకు ఇసుక తరలిస్తుంటే పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇటు స్థానిక అవసరాలకు ఇసుక వాడుకునే అవకాశం లేక.. అటు వాగు పరిధిలో భూగర్భ జలాలు అడుగంటి పంటలకు నీరందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు మండలాల్లో సాగునీటి వనరులు లేవు.. ఆ పరిధిలో ప్రవహించే బిక్కేరు వాగుపై ఆధారపడి బోర్లు, బావుల ద్వారా వందలాది మంది రైతులు వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వాగు ఒక్కసారి పుష్కలంగా పారిందంటే రెండు పంటలకు సాగునీరు అందుతుంది. కొన్నేండ్లుగా వాగులో 20, 30 ఫీట్ల మేర ఇసుక పేరుకుపోయి నాణ్యతగా ఉండటంతో మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇసుక వ్యాపారుల కన్ను బిక్కేరు వాగుపై పడింది. కొంత కాలంగా అడ్డగూడూర్ మండలం జానకిపురం, చిర్రగూడూర్ నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నారు. గుండాల మండలం బండకొత్తపల్లి నుంచి కూడా ఇసుక రవాణా చేశారు. గతంలో ఇసుక తరలించుకపోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రాంత రైతులు అడ్డుకున్నారు. కానీ ఇటీవలి కాలంలో ఇసుకాసురులు తమ పవర్, పలుకుబడిని ఉపయోగించి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులతో కలిసి ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారన్న ఆరోపణలున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ సహకరించకపోవడం, అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేయిస్తుండటంతో రైతులు చేసేది లేక వెనక్కి తగ్గుతున్నారు. అలా కేసులు నమోదు చేయించిన సంఘటనలు కూడా ఉన్నాయి. బయటి వారు ఇసుక తరలించుకుపోతున్నా.. ఈ ప్రాంతం వారికి మాత్రం ఉపయోగించుకునే అవకాశం ఇవ్వడం లేదు. బిక్కేరు వాగు నుంచి ఇసుక తీసుకెళ్లవద్దని హైకోర్టు స్టే ఉందని, కలెక్టర్ నుంచి అనుమతులు లేవంటూ అధికారులు సాకులు చెబుతున్నారని స్థానికులంటున్నారు. లారీలతో యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తరలించుకుపోయే వారికి ఆ నిబంధనలు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు.
మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం!
ఊరోళ్లకు ఇసుక దొరక్క ఇబ్బందులు పడుతుండగా, బయటి వ్యక్తులు యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తరలించుకపోతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. బస్వాపురం ప్రాజెక్టు, కాళేశ్వరం కాల్వల లైనింగ్ పేరుతో ఇసుక తరలింపుకు అనుమతులు ఇస్తున్నారు. ఆయా మండలాల్లో ఇండ్ల నిర్మాణాలకు, అభివృద్ధి పనులకు ట్రాక్టర్లతో ఇసుక తీసుకెళ్లడానికి మాత్రం అధికారులు అనుమతించకపోవడంతో రైతుల ఎడ్ల బండ్లతో ఇసుక తెప్పించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బిక్కేరు వాగు నుంచి ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఈ ప్రాంత రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ధ్వంసమవుతున్న రోడ్లు
రోజూ రేయింబవళ్లు ఓవర్ లోడ్‌తో ఇసుక రవాణా చేస్తున్న లారీలతో రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. గుండాల మండలం బండకొత్తపల్లి, అడ్డగూడూర్ మండలం జానకిపురం, చిర్రాగూడూర్ గ్రామాల బిక్కేరు వాగు నుంచి వందల సంఖ్యలో లారీలు మోత్కూరు మున్సిపల్ కేంద్రం మీదుగా హైదరాబాద్ వెళుతున్నాయి. సింగిల్ రోడ్లు కావడం, పైగా ఎప్పుడో వేసిన బీటీ రోడ్లు కావడంతో కల్వర్టులు, రోడ్లు కుంగిపోయి, గుంతలు పడి బీటీ లేచిపోయింది. మోత్కూరు బిక్కేరు వాగుపై ఉన్న సింగిల్ లేన్ బ్రిడ్జి ఇప్పటికే శిథిలావస్థకు చేరగా.. ఓవర్ లోడ్‌తో వెళుతున్న ఇసుక లారీల కారణంగా అది ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాంతం నుంచి ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తులు దెబ్బతిన్న రోడ్లను ఎవరు బాగు చేయిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. లారీలు పట్టణం మధ్య నుంచి వెళుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడటం, ఇసుక రోడ్లపై పడి ద్విచక్ర వాహనదారులు జారీ పడటం, దుమ్ము లేస్తుండటంతో దుకాణాలు, ఇండ్లన్నీ దుమ్ముమయం అవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇసుకకు అనుమతి ఉంది
ఇసుక తవ్వడానికి ప్రభుత్వ అనుమతి ఉంది. గ్రామాల ప్రజలు అడిగితే కూడా చలాను కట్టిన వారికి అనుమతి ఇస్తున్నాం. ఎవరికీ వద్దని చెప్పలేదు.
- షేక్ అహ్మద్, తహసీల్దార్, అడ్డగూడూర్, యాదాద్రి భువనగిరి జిల్లా