Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చార్జీలు తగ్గించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హెచ్చరిక
- హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను టిక్కెట్‌పై రూ.ఐదు వరకు పెంచడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. పెంచిన చార్జీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి చార్జీలను తగ్గించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. 'పెంచిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించాలనీ, రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి రెండు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 'ఆర్టీసీని కాపాడాలి, పెంచిన చార్జీలను తగ్గించాలి'అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ఈ చార్జీలు పెంచడానికి ఆర్టీసికి వస్తున్న నష్టాలు కారణమని ప్రభుత్వం చెప్తున్నదని అన్నారు. ఆ నష్టాలు పూడ్చడానికే ఈ పెంపు అవసరమంటున్నదని చెప్పారు. ఈ నష్టాలకు ప్రజలు కారణం కాదని చెప్పారు. ఆర్టీసీ యాజమాన్య అసమర్థ నిర్వహణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్లే ఈ నష్టాలు వస్తున్నాయని విమర్శించారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అమలు చేస్తున్నప్పటి నుంచి ఆర్టీసీ సహా ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వాలు ప్రయివేటుపరం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని గుర్తు చేశారు. బస్సులు నడిపేందుకు కొత్త రూటు ప్రారంభమైతే ప్రయివేటు వారికి ముందుగా అవకాశం కల్పించాలనీ, వారు ముందుకు రాకపోతే ఆర్టీసీ ఆ రూట్లలో నడుపుతున్నారని వివరించారు. బాగా లాభాలొచ్చే రూట్లలో ప్రయివేటు వారికి అవకాశముంటుందనీ, లాభాలు రాని రూట్లు గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతోందనీ, ఆ నష్టాలను ప్రభుత్వం భరించాలని సూచించారు. కానీ ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయనే కారణంతో చార్జీలు పెంచడం సరైంది కాదని చెప్పారు. ప్రపంచబ్యాంకు ఆదేశాల్లో భాగంగానే ఆర్టీసీని ఏడు కార్పొరేషన్లుగా విభజించాలని నిర్ణయించారని అన్నారు. దీనివల్ల బస్సుల సంఖ్యతో పాటు 20 శాతం సిబ్బంది తగ్గిపోతుందని వివరించారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలనే ఇప్పుడు టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ వచ్చినా పరిస్థితి ఏం మారలేదన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 55 వేల మంది కార్మికులుంటే ఇప్పుడు 44 వేల మందికి తగ్గారని అన్నారు. ఉద్యోగాలిస్తామనీ, కొత్త పథకాలు ప్రవేశపెడతామంటూ కేసీఆర్ ఎన్నో ఆశలు కల్పిస్తున్నారని చెప్పారు. ఎన్నికలు వెంటనే వస్తాయన్న తొందరలో సీఎం ఉన్నట్టు కనిపిస్తున్నదని అన్నారు. ఆయన ప్రకటించినట్టుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు మాత్రం రాలేదన్నారు. కానీ ఆర్టీసీ చార్జీల పెంపు మాత్రం వెంటనే అమల్లోకి వచ్చిందని చెప్పారు. తక్షణమే ఈ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీని మూసివేయడానికే ఈ నిర్ణయం : ఎస్ వీరయ్య
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆర్టీసీ చార్జీలు ఐదు రూపాయలు ఒకేసారి పెరగలేదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. ఆర్టీసీని మూసివేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల ఆర్టీసీపై పెనుభారం పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మెట్రోరైల్‌తో సమానంగా పెంచడం వల్ల ఆర్టీసీకి మరింత నష్టాలు వస్తాయని చెప్పారు.ప్రజారవాణా ప్రభుత్వరంగ ంలో ఉండొద్దంటూ, ప్రయివేటుపరం చేయాలంటూ కేంద్రం చట్టం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలనీ, ప్రయివేటుపరం చేయొద్దనీ, రవాణా చట్టాన్ని మార్చాలంటూ కేంద్రపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి మాట్లాడుతూ కరోనా కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రత ఒకవైపు ఉంటే ఆర్టీసీ చార్జీలను పెంచి రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులపై మరింత భారం మోపిందని విమర్శించారు. సీపీఐ(ఎం) సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్, డిజి నరసింహారావు, చుక్క రాములు, జాన్‌వెస్లీ, టి సాగర్, పాలడుగు భాస్కర్, మల్లు లక్ష్మి, ఎండీ అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్‌బాబు, జె బాబురావు, నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు.