Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాస్టళ్ల విద్యార్థులకు అందని యూనిఫాం
- అవసరమైనన్ని దుప్పట్లు లేక అవస్థలు
- తలుపులు లేని కిటికీలే అధికం
- ముద్దకట్టిన అన్నం.. జారిపోయే పప్పు
- ఎక్కడా కనిపించని భోజనశాలలు
నవతెలంగాణ-నల్లగొండ
సౌకర్యాలు నాస్తి.. సమస్యలు జాస్తి..అన్నట్టుగా ఉంది బీసీ హాస్టళ్లల్లో విద్యార్థుల పరిస్థితి. తాగేందుకు నీళ్లుండవు.. రాత్రయితే వెలుగుండదు.. పరిసరాల్లో దోమల మోత.. ఇదీ హాస్టళ్లలో పరిశుభ్రత పరిస్థితి. పుస్తకాలకు దిక్కులేదు.. యూనిఫాంకు గతిలేదు. ముద్దకట్టిన అన్నం పెడుతున్నారు. కిటికీలకు తలుపుల్లేక రాత్రివేళల్లో దోమల బెడతతో విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 74 ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయి. 46 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 2232 మంది, 28 బీసీ హాస్టళ్లలో 1472 మంది 1-10 తరగతుల విద్యార్థులు ఉన్నారు. అయితే, దాదాపు అన్ని వసతి గృహాల్లోనూ కనీస వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పర్యవేక్షణ లేక.. మోను అమలుకాక.. సౌకర్యాలకు నోచుకోక విద్యార్థులంతా అల్లాడిపోతున్నారు. దుప్పట్లు కూడా పంపిణీ చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. విద్యా సంవత్సరం పూర్తికావొస్తున్నా విద్యార్థులకు యూనిఫాం.. నోట్ పుస్తకాలు అందకపోవడంతో చదువులు కూడా సాగడం లేదు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో ఉన్న ప్రభుత్వ వెనుకబడిన బాలుర వసతి గృహంలోని భవనాల కిటికీలకు తలుపులు కూడా లేవు. ఇదే పరిస్థితి అన్ని హాస్టళ్లలోనూ నెలకొంది.
అందని బెడ్షీట్లు.. పుస్తకాలు
బీసీ హాస్టళ్ల విద్యార్థులకు బెడ్లు షీట్లు ఇంకా రాలేదు.
ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల విద్యార్థులకు కప్పుకోవడానికి దుప్పట్లు వచ్చినా.. కింద పరుచుకోవడానికి కార్పెట్లు రాలేదు. ఒక దుప్పటిని ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు కప్పుకుంటున్నారు. జిల్లాలో చాలా వసతి గృహాల్లోనూ ఇంతవరకు ఒక్కటంటే ఒక్క పుస్తకమూ అందలేదు. పుస్తకాలు లేక ఖాళీ బ్యాగులతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు నాలుగు జతల యూనిఫాం పంపిణీ చేయాల్సి ఉంది. ఒక్క ఎస్సీ హాస్టళ్లలో తప్ప మిగతా హాస్టళ్లలో యూనిఫాం అందలేదు.
కన్నెత్తి చూడని వైద్యులు..
నిబంధనల మేరకు ప్రతినెలా ప్రభుత్వ వైద్యులు సమీప వసతి గృహాలకు వెళ్లి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాలి. కానీ చాలా హాస్టళ్లలో విద్యార్థులకు వైద్యులు వస్తారనే సమాచారం కూడా తెలియదు. జిల్లా కేంద్రంలోని హాస్టళ్లకే వైద్యులు వెళ్లడం లేదంటే.. ఇక మారుమాల గ్రామాల్లో ఉన్న వసతి గృహాల పరిస్థితి ఎలా ఉంటోందో అర్థం చేసుకోవచ్చు.
నెలాఖరుకు యూనిఫాం ఇస్తాం..
బీసీ హాస్టళ్లకు సంబంధించి క్లాత్ విడతల వారీగా జిల్లాకు చేరుతోంది. వచ్చినది వచ్చినట్టుగా కుట్టడానికి పంపాం. ఈ నెలాఖరు నాటికి యూనిఫాం అందజేస్తాం. నోట్ పుస్తకాలకు మరోవారం పట్టొచ్చు. ప్రయివేట్ బిల్డింగులకు మెష్ (వల) కొట్టించలేదు. అయితే ప్రతి గదిలోనూ దోమల కాయిన్స్, లిక్విడ్ ఉంచేలా చర్యలు తీసుకుంటాం.
- పుష్పలత- జిల్లా బీసీ అభివృద్ధి అధికారి