Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28, 29 తేదీల్లోని సమ్మెకి రాజకీయ ప్రాధాన్యత
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
- ప్రజలందర్నీ వీధుల్లోకి రప్పించేలా ప్రచారముండాలి : చాడ
- మోడీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి:ముఠాగోపాల్
- అబద్ధాల ప్రచారంతోనే అధికారంలో బీజేపీ : బెల్లయ్యనాయక్
- సమ్మె జయప్రదం కోసం కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీకి విరుగుడు లౌకిక భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కార్మిక సంఘాలు 28,29 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన సమ్మెకు రాజకీయ ప్రాధాన్యత నెలకొన్నదనీ, మతోన్మాదానికి అడ్డుకట్ట వేసేందుకు అది ఒక సాధనం అని అన్నారు. సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సార్వత్రిక సమ్మె జయప్రదాన్ని కోరుతూ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ..ఎన్ని చేసినా బీజేపీని అడ్డుకోలేకపోతున్నామనే చర్చ నడుస్తున్నదనీ, ఆ భావాన్ని మెదళ్ల నుంచి తీసివేయాలని సూచించారు. రాజకీయంగా ఓట్లు సాధించలేకపోవచ్చునేమోగానీ ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని మాత్రం తక్కువగా అంచనా వేయొద్దన్నారు. మతోన్మాద భావజాలం వేగంగా విస్తరిస్తున్నదనీ, దాన్ని తిప్పికొట్టేందుకు మన శక్తిని కూడగట్టుకోవాలని చెప్పారు. ఓటములను విజయానికి మార్గంగా మలుచుకుని చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోరాటాల వల్లనే 8 గంటల పనిదినం, కార్మిక హక్కులు సిద్ధించాయన్నారు. వాటిని నిర్వీర్యం చేసే పనికి మోడీ సర్కారు నేడు పూనుకున్నదని విమర్శించారు. సమ్మెకు తమ పార్టీ పూర్తి మద్దతునిస్తుందనీ, ప్రతి ఒక్కరూ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..కేంద్రంలోని మోడీ సర్కారు ఓవైపు ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేస్తూ మరోవైపు కార్మికవర్గంపై ముప్పేట దాడి చేస్తున్నదని విమర్శించారు. సమ్మెలో మహిళా, విద్యార్థి, యువజన సంఘాలను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు. వంద శాతం ప్రజలు తమ నిరసనను తెలిపేలా ప్రచారం ఉండాలన్నారు. ప్రజా ఉద్యమాలకు మించినవేవీ లేవని నొక్కి చెప్పారు. వాటిని విజయవంతం చేస్తేనే పాలకుల్లో వణుకు పుట్టి తాము అనుసరించాలకున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల నుంచి వెనక్కి తగ్గుతారన్నారు. కార్మిక సంఘాల ఆందోళనకు తమ పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కమిటీలకు ఈ సమాచారం అందజేశామని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. సింగరేణిలో నాలుగు బ్లాకుల ప్రయివేటీకరణకు మోడీ సర్కారు పూనుకున్నదని విమర్శించారు. దేశానికి ఆర్థికంగా ఇతోధికంగా ఉపయోగపడుతున్న ఎల్ఐసీ, బ్యాంకులు, రైల్వే సంస్థలను కూడా ప్రయివేటీకరించడం దారుణమన్నారు. అంబానీ, ఆదానీ సేవలో మోడీ ప్రభుత్వం మునిగితేలు తున్నదన్నారు. పెట్రోల్‌బంకులు, సినిమాహాళ్లు కూడా బంద్ పెడితే బాగుంటుందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలతో ముందు కెళ్తున్న మోడీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగ వ్యవస్థలన్నింటి విధ్వంసానికి బీజేపీ ప్రభుత్వం పూనుకున్నదని విమర్శించారు. ఎన్ని అబద్దాలాడైనా, అసత్య ప్రచారాలు చేసైనా సరే అధికారం దక్కించుకోవడమే అమిత్‌షాకు తెలుసని విమర్శించారు. ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో కార్మికవర్గం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజాఉద్యమాలతోనే మోడీ సర్కారు మెడలు వంచటం సాధ్యమవుతుందన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరావు, ఎస్‌యూసీఐ(సి) రాష్ట్ర కార్యదర్శి మురహరి, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, సీపీఐ(ఎంఎల్)ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమ, సీపీఐ(ఎంఎల్) నేత భూతం వీరయ్య, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ నేత జెవి చలపతిరావు మాట్లాడుతూ..సంఘటితంగా ముందుకెళ్తేనే మోడీ విధానాలను తిప్పికొట్టవచ్చని తెలిపారు. మహిళలను పెద్ద ఎత్తున సమ్మెలో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి, ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనేందుకు వీలుగా టీఆర్ఎస్ తమ గుర్తింపు సంఘాలకు అనుమతి నివ్వాలని కోరారు. అవకాశవాదం ఎక్కువ కాలం నిలవదనీ, నిజంమీద నిలబడేవారు, కార్మికులు, ప్రజల పక్షాన పోరాడే కమ్యూనిస్టులు కలకాలం ఉంటారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఆర్డీ చంద్రశేఖర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం, హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు, ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ, ఏఐయుటీయూసీ నాయకులు భరత్, కొలిపాక కిషన్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న. పి.శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.