Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ల ప్రత్యేక భేటీ
- ఎల్లారెడ్డిపేటలో రేవంత్ సభ
- వీహెచ్‌తో హరీశ్‌రావు భేటీపై అనుమనానాలు
- కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ చిచ్చు : అద్దంకి దయాకర్
- నన్ను సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదు : జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అంతర్గత కలహాల కాంగ్రెస్ నేడు కుంపట్ల కాంగ్రెస్‌గా మారుతున్నది. అధితప్యపోరుకు అలవాలంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారీ ఇది రివాజు. అయితే ఈసారి ఎన్నికలకు ముందు నుంచి కలహాలు రాజుకున్నాయి. ఒకవైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ సభలు నిర్వహిస్తుంటే, సీనియర్లు మాత్రం కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన్ను దించాలనే ఆ పార్టీలో కొందరు సీనియర్ నేతలు పట్టుబడుతున్నారు. ఈ వివాదం గాలివానలా మారి పార్టీ రెండు వర్గాలు చీలిపోయే పరిస్థితి నెలకొంది. ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ సీనియర్లు మర్రి శశిధర్‌రెడ్డి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, శ్యామ్మోహన్ రావు, కమలాకర్‌రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హాజరుకావాలని వీహెచ్ అందర్నీ ఆహ్వానించారు. రేవంత్‌రెడ్డి ఆ పదవి నుంచి తొలగించాలనే ప్రధాన డిమాండుతో చర్చించినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షులు సోనియాగాంధీకి లేఖ రాయాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే 'సీనియర్ల ప్రత్యేక భేటీ'పై అధిష్టానం సీరియస్ అయింది.
తెరపైకి హరీశ్‌రావుతో వీహెచ్ భేటీ
కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ చిచ్చు పెడుతున్నదంటూ పీసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్, ఏ అనిల్, మానవతారారు తదితరులు విమర్శించారు. మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో మాజీ ఎంపీ వి హనుమంతరావు రహస్యంగా ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. వీహెచ్‌తో రహస్యంగా భేటీ కావాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. మంత్రి హరీష్‌రావుతో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ రహస్య సమావేశం తర్వాతే.. సీనియర్ల భేటీలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పార్టీలో చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం చేసేవారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమకు పార్టీ షోకాజ్ నోటీస్ ఇస్తే సమాధానం చెబుతామనీ, అయితే నన్ను సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తనను సస్పెండ్ చేస్తే రోజుకొకరి బండారం బయటపెడతానని హెచ్చరించారు.