Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ అధికారంలోకి రాలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని ఆ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...యూపీలో కష్టపడి పనిచేసిన జిల్లా అధ్యక్షులకు ఎమ్మెల్సీ సహా అనేక నామినేటెడ్ పదవులిచ్చి గౌరవించిందనీ, తెలంగాణలోనూ అలాగే చేస్తామని హామీనిచ్చారు. టీఆర్ఎస్ నేతల దాడులు, పోలీసుల కేసులకు భయపడకుండా అన్నింటికీ సిద్ధమై తెగించి కొట్లాడాలని సూచించారు. స్థానిక సమస్యలే ఎజెండాగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోరాటాలు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. ప్రజలు టీఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనీ, దానిని అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలుపై డ్రామాలు
రాష్ట్రంలో షరియత్ చట్టాన్ని అమలు చేసే కుట్ర జరుగుతున్నదని బండి సంజరు అన్నారు. బోధన్ ఘటనపై ఆయన స్పందించారు. భజరంగదళ్, హిందూవాహిని కార్యకర్తలపై లాఠీచార్జిని ఖండించారు. యాసంగిపై మళ్లీ కేసీఆర్ డ్రామాలు షురూ చేశాడని విమర్శించారు. పండించిన ప్రతి గింజ కొంటామని కేంద్రం ప్రకటించినా ఎందుకీ డ్రామాలని ప్రశ్నించారు. యాసంగి ధాన్యం సేకరణపై గతంలో చేసిన ప్రకటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు పెద్ద స్కాం అనీ, దానిలో మంత్రులు, ఎమ్మెల్యేల హస్తం ఉందని ఆరోపించారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే...సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.