Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత, గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపేంది కాంగ్రెస్సే.. : టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ/తూప్రాన్‌రూరల్(మనోహరాబాద్)
'సర్వోదయ సంకల్ప యాత్ర' ద్వారా కేసీఆర్ మోసపూరిత పాలనను ప్రజల్లో ఎండగడుతున్నామని టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. భూదానోద్యమం చేపట్టి 75 ఏండ్లు గడిచిన సందర్భంగా.. ఎన్ఎస్యూఐ జాతీయ మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీ మీనాక్షీ నటరాజన్ చేపట్టిన సర్వోదయ సంకల్ప యాత్ర ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్‌కు చేరుకుంది. ఈ యాత్రలో ఆదివారం ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొని యాత్రకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను సంఘటితం చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను దేశంలోనే ఆదర్శంగా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందన్నారు. వాటిని నేడు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. నేడు మహిళా సంఘాల స్కీముల్లో వడ్డీలేని రుణాలు.. రూ.2400కోట్టు ఉన్నాయంటే కేసీఆర్ పాలన ఏవిధంగా ఉందో మహిళలు అర్థం చేసుకోవాలని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి అని గద్దెనెక్కి ఎనిమిదేండ్లు అయినా ఒక్క శాతం కూడా ఇవ్వలేదని, మరోసారి దళిత బంధుతో మోసం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడని విమర్శించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. గతంలో పేదల ఆత్మగౌరవం కోసం సీలింగ్ ఆక్ట్ తీసుకొచ్చి భూదానోద్యమంలో భాగంగా భూములను పంచితే.. నేడు కేసీఆర్ ప్రభుత్వం ఆ భూములను లాక్కుని వాటిలో రియల్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. దాంతో పేదలను మరింత పేదలుగా మార్చే కుట్ర చేస్తున్నారని తెలిపారు. పేదలకు భూములు ఇచ్చింది ఎవరు.. ఆ భూములను నేడు లాక్కుంటున్నది ఎవరో యువత తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగానే ధరణి పోర్టల్‌లో కబ్జా కాలాన్ని తీసేసి.. పేదలకు చెందిన భూములను అధికార పార్టీ అండదండలున్న నాయకులు కబ్జాచేస్తున్నారని ఆరోపించారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, నాయకులు నాగులపల్లి కావేరిగారి వెంకట్‌రెడ్డి, సత్యనారాయణ, గరిగె నర్సింగ్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.